Jr NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు కన్నీళ్లు.. ఎంత హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే. తన భార్యపై వైసీపీ నేతలు అసభ్య, అమానవీయ వ్యాఖ్యలు చేశారంటూ.. మీడియా ముఖంగా టీడీపీ అధినేత ఏడ్చేయడం ఒకింత సంచలనం రేకెత్తించింది. ఈ విషయమై పసుపు దళం భగ్గుమంది. నందమూరి కుటుంబం విభేదాలు పక్కనపెట్టి ఒక్కటిగా ఖండించింది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం తప్పుబట్టారు. దీంతో.. అనివార్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే.. ఆయన స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. జూనియర్ తీరు పద్ధతిగా లేదంటూ పంచాయితీ పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆ విధంగా.. చంద్రబాబు కన్నీళ్ల ఎపిసోడ్ లో.. జూ.ఎన్టీఆర్ ను టీడీపీ టార్గెట్ చేసింది. మరి, వాళ్ల అభ్యంతరం ఏంటన్నది చూద్దాం.

శాసన సభలో నారా భువనేశ్వరిపై అధికార పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను దాదాపుగా అందరూ ఖండించారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. తమ ఇంటి ఆడపడుచు గురించి చులకనగా వ్యాఖ్యలు చేస్తారా అంటూ.. నందమూరి కుటుంబం మండిపడింది. బాలయ్య హెచ్చరికలు చేశారు. వైసీపీ నేతలు హద్దు మీరితే.. ఇకపై చూస్తూ ఊరుకోబోమని అన్నారు. మెగా ఫ్యామిలీ కూడా బాబుకు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే.. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో సందేశం ఒకటి విడుదల చేశారు.
అందులో ఏం మాట్లాడారంటే.. అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే.. అవి ప్రజాసమస్యలపై జరగాలి. అంతేకానీ.. వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. ఈ సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అందించాలి అని చెప్పారు. ఇక్కడే టీడీపీ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.
జూనియర్ ఇచ్చిన మొత్తం సందేశంలో.. ఎక్కడా చంద్రబాబు పేరుగానీ.. భువనేశ్వరి పేరుగానీ ప్రస్తావించ లేదు. అంతేకాదు.. టీడీపీకి మద్దతుగానూ మాట్లాడలేదు. వైసీపీ నేతలు చేసింది తప్పు అని నేరుగా చెప్పిందీ లేదు. ఈ విధంగా.. ఎక్కడా సూటిగా మాట్లాడకుండా ఒక సందేశం ఇచ్చానని అనిపించుకున్నాడన్నది టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణం. ఈ మాత్రం దానికి ఆ సందేశం ఎందుకని ఆక్రోశిస్తున్నారు. భువనేశ్వరిని తిట్టారని చెబుతున్న.. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ పైనా ఒక్క మాట కూడా మాట్లాడ లేదని మండిపడుతున్నారు. పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జూనియర్ ను నిలదీస్తున్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబు పరువు ఎవరు తీస్తున్నారు..?
కొడాలి నాని, వల్లభనేని వంశీ.. జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గరివారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆ కారణంగానే మౌనంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం చంద్రబాబు, భువనేశ్వరి పేరు ప్రస్తావించకపోవడం సరికాదని అంటున్నారు. ఇటు.. రాజకీయ వర్గాల్లోనూ ఈ చర్చ నడుస్తోంది. జూనియర్.. భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొనే ఇలా వ్యవహరించాడా? అని చర్చించుకుంటున్నారు. మరి, విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రచారంపై స్పందిస్తాడేమో చూడాలి.
Also Read: KCR Jagan: కలిసిన కేసీఆర్, జగన్..చంద్రబాబు సింపతిపై కీలక సమాలోచనలు?