‘తమన్నా’ సినీ కెరీర్ కొత్త హీరోయిన్లకు ఓ ప్రేరణ. మొదట్లో హీరోయిన్ గా పనికిరాదు అన్నారు. ఎలాగోలా కష్టపడి హీరోయిన్ అయ్యాక.. ‘అరె.. ఐటమ్ పాపలా ఉంది, ఈమె హీరోయిన్ ఏమిటి ? అంటూ విమర్శలు చేశారు. కాలం ఎప్పటిలాగే ముందుకు కదిలింది. ఎవరూ ఊహించని విధంగా తమన్నా నాలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ అయ్యాక, ప్రత్యేక గీతాల్లో ఏ హీరోయిన్ నటించడానికి ఇష్టపడదు.
కానీ, తమన్నా స్పెషల్ సాంగ్స్ లోనూ కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇక వెండితెర పై వెలిగిపోతున్న సమయంలో చిన్న హీరోయిన్ కూడా డిజిటల్ తెర పై ఆడిపాడటానికి ఆసక్తి చూపించదు. కానీ తమన్నా వెబ్ సిరీసుల్లోనూ తన సత్తా ఏమిటో సగర్వంగా చాటి చెప్పింది. ఇప్పుడు టీవీ రంగంలోనూ కాలుమోపుతోన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకోవడానికి అన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
నేను హీరోయిన్ గా ఎదిగింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లే. అయితే, నేను సౌత్ భాషలన్నింటిలోనూ సినిమాలు చేసినా.. నాకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది మాత్రం టాలీవుడే. అందుకే నాకు తెలుగు అంటే ఇష్టం. ప్రపంచమంతా నన్ను తెలుగు అమ్మాయిగానే గుర్తించడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది.
ఇక తెలుగు తనం మా ఇంట్లో కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో తెలుగు వంటలు కూడా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రెండు ఐటమ్స్ పూత రేకులు, ఆవకాయ అంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టం. ప్రస్తుతం నేను చేస్తోన్న మాస్టర్ చెఫ్ షో వల్ల మరెన్నో ప్రాంతీయ వంటకాల పై ఇష్టం పెంచుకున్నాను. అన్నట్టు నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి ‘మాధురి దీక్షిత్’. ఆమెను చూసే నేను ఆమెలా అవ్వాలి అనుకున్నాను.
ఇక నేను కూడా అందరి అమ్మాయిలు లాగే మా అమ్మానాన్నల ముద్దుల కూతుర్ని. అయితే, ఈ కరోనా కారణంగా ఎక్కువ కాలం ఇంట్లో వాళ్లతో గడిపే అవకాశం వచ్చింది. అమ్మానాన్నలతో గడపటం వల్ల మా మధ్య అనుబంధాలు మరింతగా బలపడ్డాయి. అలాగే నాకు ఒక అన్నయ్య ఉన్నారు. పేరు ఆనంద్, తను ఒక డాక్టర్. తను అన్నగా కంటే నాకు ఓ మంచి స్నేహితుడిలా ఉంటాడు.