SV Krishna Reddy concepts : బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే సంచలన ఆరోపణలు, కామెంట్స్ తో కూడా ఆయన పాప్యులర్ అయ్యారు. వేదికల మీద ఆయన ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి ఆయనకు పూనకం వచ్చేస్తుంది. మాటలు ప్రవాహం ఆగకుండా సాగుతుంది. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాలు కూడా రాజేశాడు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ పై అనుచిత కామెంట్స్ చేశారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తనకు ఆహ్వానం దక్కలేదని, అందుకు త్రివిక్రమ్ కారణం అంటూ.. బండ్ల గణేష్ ఫోన్ లో ఒకరితో మాట్లాడాడు. ఈ ఆడియో ఫీల్ లీక్ కావడంతో వివాదం రాజుకుంది. ఈ కారణంగా కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ దూరం కావాల్సి వచ్చింది.
తాజాగా బండ్ల గణేష్ దర్శకుడు శ్రీను వైట్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఇటీవల జరిగాయి. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో పని చేసిన పలువురు సీనియర్ నటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బ్రహ్మానందం, అలీ, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రోజా, ఆమనితో పాటు పలువురు హాజరయ్యారు. బండ్ల గణేష్ కి సైతం ఆహ్వానం దక్కింది. వేదిక మీద ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఉన్నారు. జర్నలిస్ట్ ప్రభు యాంకరింగ్ చేస్తున్నారు.
బండ్ల గణేష్ కి మాట్లాడే అవకాశం వచ్చింది. సినిమాపై మక్కువతో చెన్నై వెళ్లిన నాకు నటన పెద్దగా రాదు. నటుడిగా పరిశ్రమలో నిలబడటం కష్టమే అనుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటున్న తరుణంలో ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశం ఇచ్చారు. వినోదం సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. అదే నటుడిగా నన్ను నిలబెట్టింది.. అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. వినోదం మూవీలో విలన్ ఇంట్లో హీరో చేరి ఆమె కూతురిని వివాహం చేసుకుంటాడు. ఎస్వీ కృష్ణారెడ్డి కాన్సెప్ట్ లను కాపీ చేసి శ్రీను వైట్ల వంటి దర్శకులు కోట్లు సంపాదించారు. ఆయన కథలు రెండు దశాబ్దాల పాటు పలువురు దర్శకులకు స్ఫూర్తినిచ్చాయి అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి కాన్సెప్ట్ లను ఈ తరం దర్శకులు కాపీ చేశారు అంటే బాగుండేది. బండ్ల ఏకంగా శ్రీను వైట్ల పేరు ఎత్తడం వివాదాస్పదంగా మారింది. ఒకవేళ నిజంగా శ్రీను వైట్ల ఎస్వీ కృష్ణారెడ్డి కథలను, కామెడీని కాపీ చేసినా అందులో తప్పు లేదు. ఎందుకంటే ప్రతి తరం దర్శకులు, రచయితలు వారి ముందు తరం వారి నుండి స్ఫూర్తి పొందుతారు. ఎస్వీ కృష్ణారెడ్డి కథలకు కూడా ఆయన సీనియర్ దర్శకుల సినిమాలు స్ఫూర్తి ఇచ్చి ఉండొచ్చు. రాజమౌళి, సుకుమార్ వంటి టాప్ దర్శకులు కూడా ఈ కోవలోకి వస్తారు. కాబట్టి ప్రతి దర్శకుడి చిత్రాల్లో అంతకు ముందు దర్శకులు తీసిన సన్నివేశాలు, కథల ఛాయలు కనిపిస్తాయి. బండ్ల ప్రత్యేకించి శ్రీను వైట్ల పేరు ఎత్తకుండా ఉండాల్సింది. మరి బండ్ల కామెంట్స్ ని శ్రీను వైట్ల ఎలా తీసుకుంటారో చూడాలి.