Annadatha Sukhibhav : అన్నదాత సుఖీభవ( annadatha Sukhi Bhava ) పథకం డేట్ ఫిక్స్ చేశారా? ఈనెల 19న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారా? పీఎం కిసాన్ తో కలిపి అందించనున్నారా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ వెబ్సైట్ మార్చింది. దీంతో పథకం అమలు చేస్తారని అంతా భావించారు. అయితే ఏడాది అవుతున్న ఇంకా ఆ పథకం పట్టాలెక్కలేదు. కానీ ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించడంతో అందరిలోనూ నమ్మకం కుదిరింది. ఈ పథకం జూన్ నెలలోనే అమలు చేస్తామని సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రకటనలు చేశారు. దీంతో నిధులు విడుదల ఎప్పుడా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
* అప్పట్లో రైతు భరోసా పేరిట..
నవరత్నాల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా( raithu Bharosa ) పథకాన్ని అమలు చేసింది. ఏడాదికి 15000 రూపాయల చొప్పున సాగుకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే దానిని 7,500 రూపాయలకు పరిమితం చేసింది వైసిపి ప్రభుత్వం. కేంద్రం అందించే 6000 రూపాయల మొత్తంతో.. 13500 రూపాయలను ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 20వేల రూపాయల చొప్పున సాగు సాయానికి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కీలక ప్రకటన చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
Also Read : అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ!
* మూడు విడతల్లో సాయం..
కేంద్రం పిఎం కిసాన్( pm Kisan) కింద అందించే 6000 రూపాయల మొత్తం కలిపి.. రాష్ట్ర ప్రభుత్వం 14000 జత కలిపి అందించడానికి నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత కేంద్రం తొలి విడతగా 2000 రూపాయలను అందించనుంది. ఈనెల 19న పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి కేంద్రం పీఎం కిసాన్ అందిస్తోంది. అందుకే పీఎం కిసాన్ తో కలిపి తొలి రెండు విడతల్లో 5000 చొప్పున.. చివరి విడత 4000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
* ఖరీఫ్ పనులు ప్రారంభం..
ప్రస్తుతం ఖరీఫ్( kharif) పనులు ప్రారంభం అయ్యాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కూడా కురిసాయి. దీంతో రైతులు వరి ఆకుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. వరి విత్తనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు సాగు ప్రోత్సాహం కింద అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అటు కేంద్రం సైతం ఈనెల 19న పులి విడత నిధులు విడుదలకు సిద్దపడుతోంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.