నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు;
రచన, దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్;
సంగీతం: షాన్ రొనాల్డ్;
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్;
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కాదిర్;
నిర్మాత: సూర్య, జ్యోతిక;
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో

త.శె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన కోర్టు రూమ్ డ్రామా ‘జై భీమ్’. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ :
చంద్రు(సూర్య) ఒక సీరియస్ అడ్వొకేట్. అయితే రాజన్న(మణికందన్) గిరిజనుడు. పైగా అతను నిజాయతీపరుడు కూడా. కానీ అలాంటి వ్యక్తి పై ఓ తప్పుడు కేసు నమోదు అవుతుంది. ఓ స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లో రాజన్న దొంగతనం చేశాడని పోలీసులు కేసు నమోదు చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా కొడతారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం.. రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని అతడి భార్య చిన్నతల్లి(లిజో మోల్ జోసే)కు చెబుతారు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. ఈ విషయంలో ఆమెకు అడ్వొకేట్ చంద్రు(సూర్య) సాయం చేస్తాడని తెలుస్తుంది. చంద్రు కూడా ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు న్యాయ వ్యవస్థకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నాడు. ముఖ్యంగా లాయర్ సూర్య ఓ క్లిష్టమైన కేసును టేకప్ చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు, అలాగే ఆ సమస్యలను పరిష్కరించేందుకు అతను సేకరించే ఆధారాలు, వాటి కోసం చేసే రిస్కీ షాట్స్.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై ఎత్తులు ఇలా ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగా ఆకట్టుకుంటాయి.
ఐతే దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. కీలకమైన ఎమోషన్స్ అన్నీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు సాగాయి. సినిమాకి ఇవి పెద్ద మైనస్ అయ్యాయి. అసలు పోలీసులు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తారు ? అనే అనుమానం కూడా సినిమా చూసే ప్రేక్షకుల్లో కలుగుతుంది.
కాకపోతే దర్శకుడు జ్ఞానవేల్ కథా, కథనాలను నడిపించిన తీరు కట్టిపడేస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగున్నా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా చూపించొచ్చు. ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సూర్య నటన,
మెసేజ్, డైలాగ్స్,
కొన్ని ఎమోషనల్ సీన్స్
సాంకేతిక వర్గం పనితీరు
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ నెమ్మదించిన కథాగమనం
ఇంట్రెస్ట్ లేని కొన్ని సీన్స్,
ఫస్ట్ హాఫ్.
సినిమా చూడాలా ? వద్దా ?
‘జై భీమ్’ అంటూ వచ్చిన ఈ సీరియస్ ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకులను కొన్ని అంశాల్లో మెప్పిస్తోంది. ఇలాంటి సీరియస్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాని చూడొచ్చు.