Director Sukumar: ‘పుష్ప’ సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. అతడి కథా, కథనం.. డైరెక్షన్ అందరినీ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సుకుమార్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు సినీ ప్రముఖుడిగా మారిపోయాడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో రాణిస్తూ ఆయా రంగాలలో సేవలను కొనసాగిస్తున్న వారికి యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేస్తుంటుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి షరతులు లేకుండా స్వేచ్ఛగా ఉండవచ్చు. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది యూఏఈ ప్రభుత్వం. దీనిలో భాగంగా బయటి దేశాల వారు అక్కడే ఉండడం.. పనిచేసుకోవడం.. పై విద్యలు కొనసాగించేందుకు స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా అన్ని విధాలా అవకాశం కల్పిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ఉన్నవారు సొంత వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.

యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాలను లాంగ్ టర్మ్ వీసాలని అంటుంటారు. వాటి కాలపరిమితి 5-10 ఏళ్లు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా రెన్యూవల్ అవుతుంది. గోల్డెన్ వీసాలను అరుదైనవిగా భావిస్తారు. తాజాగా మన సుకుమార్ కు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హిట్టు కొట్టిన సుకుమార్ కు యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందజేసింది. దీంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టాలీవుడ్ లో ఈ గోల్డెన్ వీసాను రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా అందుకున్నారు. ఇక అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కూడా వరించింది. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ త్రిష కూడా అందుకుంది. మలయాళంలో మోహన్ లాల్ పొందారు.
ప్రస్తుతం పుష్ప2 తెరకెక్కించే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారు. గోల్డెన్ వీసా రావడంపై సుకుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.