Balapur Laddu Auction 2022: గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ ఫేమస్. ఇక్కడి ఖైరతాబాద్ గణేషుడు దేశంలొని అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. ఇక గణేష్ లడ్డూలకు ‘బాలాపూర్’ ఫేమస్. ఈ బాలాపూర్ లడ్డు తీసుకుంటే ఎంతో మంచిదని.. సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ప్రచారం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ లడ్డూ వేలంలో పాల్గొని లక్షలు పోసి కొంటారు.

ఈరోజు గణేష్ నిమజ్జనం కావడంతో బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం ప్రక్రియను ఘనంగా ప్రారంభించారు. ఈ లడ్డూ వేలం ధర ప్రతీ సంవత్సరం పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరోసారి రికార్డ్ స్థాయిలో బాలాపూర్ లడ్డూ వేలం జరిగింది.

బాలాపూర్ లడ్డూ ధర ఏకంగా రూ.24 లక్షల 60 వేలు పలకడం విశేషం. ఈ లడ్డూనే వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, అతడి స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డిలు కలిసి రూ.18.90 లక్షలకు చేజిక్కించుకున్నారు. అయితే ఈసారి అంతకుమించి అందరి అంచనాలు తారుమారు చేసి ఏకంగా వేలం పాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ లడ్డూ పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.