Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తూ ఉంటే, ఏ హీరో అభిమానికి అయినా అసూయ రావాల్సిందే. ఇక మమ్మల్ని మించిన తోపులు ఎవ్వరు లేరు అని విర్రవీగే తత్త్వం ఉన్న బాలీవుడ్ మేధావులకు వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ ప్రభంజనం ఇది. బాలీవుడ్ లో ఒక సినిమా అక్కడి ఆడియన్స్ కి ఎక్కితే లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ‘పుష్ప’ పార్ట్ 1 చిత్రానికి అక్కడ 50 రోజులకు పైగా హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. కేవలం రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా, ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందంటే ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది మీరే అర్థం చేసుకోండి.
ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్ర ప్రభంజనం కూడా అదే స్థాయిలో ఉంది. ఇలా ఒక సినిమా బీభత్సమైన రన్నింగ్ లో ఉన్నప్పుడు, ఆ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట తిరుగుతూ ఉంటాయి. అలా ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ చిత్రం గురించి ఒక ఆససక్తి కరమైన విషయం తిరుగుతుంది. అదేమిటంటే ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ పని చేసింది కేవలం 60 శాతం మాత్రమేనట. మిగిలిన 40 శాతం ఆయన శిష్యుడు శ్రీమాన్ తెరకెక్కించాడట. పుష్ప రాజ్ చిన్ననాటి సన్నివేశాలు, ట్రక్ సన్నివేశాలతో పాటు , రెండవ యూనిట్ లోని షాట్స్ మొత్తాన్ని శ్రీమాన్ తెరకెక్కించాడట. ఈ విషయాన్నీ స్వయంగా సుకుమార్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఈ చిత్రానికి టైటిల్ కార్డ్స్ లో డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమాన్ అని వెయ్యాలి. కానీ శ్రీమాన్ అందుకు ఒప్పుకోలేదు, కేవలం సుకుమార్ బ్రాండ్ మీదనే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి అనుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.
దీంతో శ్రీమాన్ కి సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రతీ సన్నివేశం లోనూ సుక్కు మార్క్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో గంగమ్మ జాతర ఎపిసోడ్ కూడా సుక్కు మార్క్ అనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో మాత్రం సుక్కు మార్క్ కనిపించలేదు. బహుశా ఇవన్నీ శ్రీమాన్ తెరకెక్కించి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కి కాస్త నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ మాత్రం ఔట్పుట్ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదని, శ్రీమాన్ సుకుమార్ నమ్మకాన్ని నిలబెట్టాడని మరికొంతమంది అంటున్నారు.