ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్‌లో చిన్నచూపు ఉండేది. తెలుగు ఇండస్ట్రీ అంటే అదెక్కడా అన్నట్టు పలువురు బాలీవుడ్ స్టార్లు చులకనగా మాట్లాడేవారు. మూసధోరణి సినిమాలే చేస్తారంటూ కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా చిన్న చూపు చూసేవాళ్లు. కానీ, కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ఎల్లలు దాటింది. దేశం దాటి.. ప్రపంచాన్ని మెప్పిస్తోంది. బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. దాంతో, టాలీవుడ్‌లో నటించేందుకు ఇతర భాషల నటులు ఆసక్తి చూపిస్తున్నారు. పర భాషా హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో సుదీప్‌తో ఇది జోరందుకుంది. ఈగ సినిమాలో విలన్‌గా నటించిన సుదీప్.. బాహుబలి, సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు.
విలక్షణ నటనతో తెలుగులోనూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్న సుదీప్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సూపర్ మహేశ్ బాబుకు సవాల్ విసరనున్నాడు. మహేశ్ హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో రాబోయే ‘సర్కారు వారి పాట’లో సుదీప్ విలన్‌గా నటించబోతున్నట్టు తెలిసింది. బ్యాంకింగ్ స్కామ్స్ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కబోయే సినిమాలో స్టైలిష్ పాత్ర కోసం చిత్రం బృందం అతడిని సంప్రదించింది. స్క్రిప్ట్ నచ్చడంతో మూవీకి అంగీకరించిన సుదీప్.. ఓ కండీషన్ పెట్టాడట. కరోనా కారణంగా ఆగిపోయిన మిగతా మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉండడంతో ‘సర్కారు వారి పాట’కు నెల రోజు డేట్స్ మాత్రమే ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఆలోపు సుదీప్ మరికొన్ని కాల్షీట్స్ చేస్తాడని చిత్ర బృందం భావిస్తోంది. దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతే సినిమాలో సుదీప్ భాగస్వామి అవుతాడో లేడో అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.