
అనుష్క శెట్టి. తన గ్లామర్ తో తొలి సినిమాలోనే ‘సూపర్’ అనిపించిన హీరోయిన్. అతి తక్కువ కాలంలో తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగిందామె. తొలుత గ్లామరస్ క్యారెక్టర్లకే ఓకే చెప్పిన ఆమె తర్వాత ‘అరుంధతి’తో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. తన అందం, అభినయం, అద్భుత నటనతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అరుంధతి తర్వాత ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ చిత్రాలతో కూడా ఆకట్టుకుందామె. బహుబలి సిరీస్ తర్వాత ఆమె పేరు దేశమంతటా మార్మోగింది. హీరో స్థాయి స్టార్డమ్, క్రేజ్ తెచ్చుకున్న అనుష్కతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ అనుష్క తన సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేయాలన్న ఒత్తిడి వచ్చినా ఇది థియేటర్లో చూపించాల్సిన సినిమా అని చిత్ర యూనిట్ డిసైడైంది.
లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో.. థియేటర్లు ఎప్పుడు మొదవుతాయో తెలియదు కాబట్టి అనుష్కను వెండితెరపై ఇప్పుడప్పుడే చూడలేం. దాంతో, ఆమె తర్వాతి ప్రాజెక్ట్ ఏంటా? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం అనుష్క మరో లేడీ ఓరియెంట్ మూవీకి ఓకే చెప్పిందట. ఈ భారీ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించనుందట. యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాల్లో స్వీటీ నటించింది. తాజా మూవీకి పి. మహేశ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. 2014 సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ను మహేశ్ డైరెక్ట్ చేశాడు. అనుష్క లీడ్ రోల్‌లో ప్లాన్ చేస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.