Star YouTuber : సోషల్ మీడియా ప్రభావంతో స్టార్స్ అయిన సామాన్యులు ఎందరో. వారిలో భార్గవ్ ఒకడు. టిక్ టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా భార్గవ్ ఫేమస్ అయ్యాడు. తనదైన కామెడీ వీడియోలతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఫన్ బకెట్ లో అనేక కామెడీ వీడియోలలో నటించాడు. దాంతో ఫన్ బకెట్ భార్గవ్ గా అతడు పాప్యులర్ అయ్యాడు. భార్గవ్ వలె సోషల్ మీడియా స్టార్స్ కావాలని ఆశపడే పలువురు అమ్మాయిలు భార్గవ్ కి పరిచయం అయ్యారు.
వాళ్ళను కూడా పాప్యులర్ చేస్తానని భార్గవ్ ఆశ చూపేవాడని సమాచారం. ఈ క్రమంలో విశాఖకు చెందిన ఓ మైనర్ బాలికతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. తరచుగా భార్గవ్, సదరు మైనర్ బాలిక కలుస్తూ ఉండేవారు. భర్తకు దూరంగా ఉంటున్న తల్లి వద్ద బాలిక పెరుగుతుంది. ఆ 14 ఏళ్ల బాలికతో భార్గవ్ లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకు బాలిక గర్భం దాల్చింది. నలతగా ఉంటున్న బాలికను గమనించిన తల్లి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
2021 ఏప్రిల్ లో ఫన్ బకెట్ భార్గవ్ పై బాలిక తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దిశ, పోక్సో చట్టాలు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లో భార్గవ్ ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న భార్గవ్ బెయిల్ పై విడుదలయ్యాడు. అనంతరం తాను నిరపరాధిని అంటూ సోషల్ మీడియాలో వీడియోలు, కామెంట్స్ పోస్ట్ చేశాడు.
కేసు విచారణలో ఉండగా భార్గవ్ కామెంట్స్ చేయడంతో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. తాజాగా విశాఖ జిల్లా ఫోక్సో కోర్ట్ భార్గవ్ నేరం చేసినట్లు నమ్మింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 4 లక్షలు బాలికకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు సంచలన తీర్పుతో భార్గవ్ కంగుతిన్నాడు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఈ కేసు గుణపాఠం అవుతుందని పలువురు భావిస్తున్నారు.