Photo Talk: స్టార్ హీరోల రేంజ్ పాపులారిటీ. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. చూడగానే ఆకట్టుకునే రూపం. అందరినీ గౌరవించే సంస్కారం. వివాదాలకు దూరం. ఆరడుగుల ఈ పొడుగు సుందరి వెండితెరపై సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. తెలుగు ప్రేక్షకుల జేజమ్మగా కీర్తించబడిన ఈ క్యూట్ గర్ల్ ఎవరో ఈపాటికి మీ మనసుకు తట్టే ఉంటుంది. ఈ ఇన్నోసెంట్ బేబీ ఎవరో కాదు అనుష్క శెట్టి. ఏడేళ్లనిమిదేళ్ళ ప్రాయంలో అనుష్క ఇలా ఉండేది. అనుష్క ఇంత పెద్ద హీరోయిన్ అవుతుందని, పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుందని వాళ్ళ పేరెంట్స్ ఊహించి ఉండరు.

నిజానికి అనుష్క కూడా తాను స్టార్ హీరోయిన్ అవుతాననుకోలేదు. ఏదో ఒక ట్రయల్ వేసింది. దర్శకుడు పూరి-నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరిపారు. ఆ ఆడిషన్స్ కి అనుష్క హాజరయ్యారు. ఆడిషన్ కూడా పెద్ద సీరియస్ గా చేయలేదట. ఏది అడిగినా తెలియదు అంటూ సమాధానం చెప్పిందట. ఈ విషయాన్ని దర్శకుడు పూరి జగన్నాధ్ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. అనుష్కలో తెలియని ప్రత్యేకత ఉందని గ్రహించిన పూరి హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు.
అనుష్కకు ఆ పేరు పెట్టింది కూడా పూరీనే. అనుష్క అసలు పేరు స్వీటీ కాగా స్క్రీన్ నేమ్ గా అనుష్క శెట్టి అని నిర్ణయించాడు. 2005లో విడుదలైన సూపర్ మూవీతో అనుష్క సిల్వర్ స్క్రీన్ జర్నీ మొదలైంది. విక్రమార్కుడు, లక్ష్యం, బిల్లా వంటి హిట్ చిత్రాలు ఆమెకు ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అనుష్క కెరీర్లో అరుంధతి ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనుష్కకు తిరుగులేని ఫేమ్ తెచ్చిపెట్టింది.

ఇక బాహుబలి చిత్రాలతో అనుష్క ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. దేవసేనగా రెండు భిన్న గెటప్స్ లో అనుష్క అలరించారు. ఈ మధ్య అనుష్క చిత్రాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టికి జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఇటీవలే అనుష్క 41వ ఏట అడుగుపెట్టారు. అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకుంటారనే పుకార్లు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. నాలుగు చిత్రాలు కలిసి చేసిన ఈ జంట మేము స్నేహితులం మాత్రమే అంటారు.