ఆ ఇద్దరు హీరోల అభిమానులు ఒకప్పుడు తమ హీరో సినిమా రెండేళ్లకు ఒకటైన రిలీజ్ అయితే బాగుండు అని ఆశ పడేవాళ్ళు. అలాంటిది, ఇప్పుడు ఆ స్టార్స్ ఇద్దరూ ఎవ్వరూ అందుకోలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నేషనల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు ఏకంగా నాలుగు సినిమాలను ఒకేసారి చేసుకుంటూ పోవడం, పైగా తమ సినిమాలను ముందుగానే ఎనౌన్స్ చేసి షూట్ స్టార్ట్ చేయడం, అలాగే తమ ప్రాజెక్టుల షెడ్యూల్స్ ను కూడా పక్కాగా లాక్ చేసుకోవడం నిజంగా విడ్డూరమే.
అసలు ఈ ఇద్దరు హీరోలకు ఒక అపవాదు కూడా ఉంది. ఈ ఇద్దరూ సినిమాలు చేయడంలో చాలా బద్దకస్తులు అని. కానీ ప్రస్తుతం అందరి హీరోలు కంటే.. ఈ ఇద్దరే ముందు ఉన్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ సీజన్ ముగిసిన వెంటనే, తాము ఒప్పుకున్న నాలుగు సినిమాలను వేగంగా పూర్తీ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈ హీరోలు సన్నద్ధం అవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ సినిమా చేస్తున్నాడు. అలాగే సైమల్టేనియస్ గా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను కూడా చేస్తున్నాడు.
ఈ సినిమాల తరువాత ఆ వెంటనే హరీశ్ శంకర్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక నాలుగో సినిమాగా నిర్మాత రామ్ తళ్లూరి – సురేందర్ రెడ్డి ప్రాజెక్టు మొదలయ్యేలా ఉంది. అలాగే ‘దిల్ రాజు – వంశీ పైడిపల్లి’తో కూడా పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని, మొత్తానికి ఈ సినిమా కూడా పవన్ సినిమాల లిస్ట్ లో చేరిందని తెలుస్తోంది. అంటే, వచ్చే ఎన్నికల్లోపు 5 సినిమాలు చేసేలా పవన్ టార్గెట్ పెట్టుకున్నాడని పవన్ సన్నిహితులు చెబుతున్న మాట.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నాడు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాల షూటింగ్ ను కూడా ఒకేసారి చేస్తూ జడ్ స్పీడ్ గా ముందుకు పోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాల తరువాత తన నాలుగో సినిమాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఇక పవన్, ప్రభాస్ దారిలోనే మిగతా స్టార్ హీరోలు కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్స్ నుండి వరుస సినిమాలు వస్తే, అప్పుడు సినీ కార్మికులకు పుష్కలంగా పని దొరుకుతుంది.