Nani: చిన్న సినిమాల్లో హీరోగా కనిపించి.. పెద్ద హిట్ కొట్టి.. మనింట్లో మనిషిగా నటనలో ఇమిడిపోయిన హీరో నేచురల్ స్టార్ నాని. భావోద్వేగం, కామెడీ ప్రధానంగా సాగే కథల్నే ఎక్కువగా ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరించే నాని.. తన కెరీర్లో తొలిసారి పూర్తి యాక్షన్ నేపథ్యానికి చెందిన సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నాని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఒకానొక కాలంలో సినిమాకు వెళ్తే కథలో ఎలా లీనమైపోతామో.. అలానే శ్యామ్ సింగరాయ్తో కనెక్ట్ అవుతామని నాన్ని అన్నారు. మరోవైపు, ఈ సినిమా హిందీలో విడుదలవుతుందా అని అడగ్గా.. ఈ సినిమా చూడగానే ఎవ్వరికైనా భారీ బడ్జెట్తో తీసుంటారని అనిపిస్తుంది.
కానీ, కథే, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందని నాని అన్నారు. టక్ జగదీశ్ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండటం వల్ల మిగిలిన భాషల్లో ఆడకపోవచ్చేమో కానీ.. శ్యామ్ సింగరాయ్కి అలాంటి పరిధులు లేవని అన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదంటూనే.. ఏమో ఏ హృతిక్ రోషనో ఈ సినిమా నచ్చి హిందీలో రీమేక్ చేస్తారనే నమ్మకం అంటూ నవ్వుతూ అన్నారు నాని.