ఇప్పటివరకు జరిగిన ఘటనలు.. వాటి పర్యావసనాలు.. పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితం పూర్తిస్థాయిలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పెట్టుకున్న వాలంటీర్లను ఈ ఉప ఎన్నికకు దూరంగా పెట్టాలని.. పోలింగ్‌లో అక్రమాలకు తావులేకుండా చూడాలని ఈసీని కోరారు.
అయితే.. ఈ అంశాలన్నింటినీ ఈసీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలన్నింటిపై ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అధికారి అయిన విజయానంద్‌కు పలు సూచనలు చేసినట్లు సమాచారం. రాళ్ల దాడి ఘటనపై సీరియస్‌గా విచారణ చేపట్టి కీలక చర్యలను తీసుకుంటామని ప్రకటించింది. ఇందుకు ఓ పోలీసు అధికారిని సైతం నియమిస్తామంది.
ఇక నిన్నటి వరకు చంద్రబాబు మీద అసలు రాళ్ల దాడి జరగలేదని చెప్పుకొచ్చిన పోలీసులు.. ఇప్పుడు ఈసీ ఆదేశాలతో విచారణ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. అలాగే.. వాలంటీర్ల విషయంలోనూ ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారికి పలు సూచనలు చేసినట్లుగా తెలిసింది. వాటి ఆధారంగా తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పోలింగ్‌కు ఒకరోజు ముందు వైసీపీ ఊహించని షాక్ తగిలినట్లయింది.