‘తిందామంటే తిండికి లేదు కానీ.. మేడలు కడుదాం’ అంటే ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులాల పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదంటే.. లక్షల లక్షల ఫీజులు లాయర్లకు మాత్రం చెల్లిస్తున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వందలు, వేల కోట్లతో పథకాలు.. పనుల ప్రకటనలు చేస్తున్నా.. పిల్లలకు పెట్టే భోజనం విషయానికి వచ్చేసరికి బిల్లులు మంజూరు చేయలేని దుస్థితిలో ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ గురుకులాల్లో పిల్లలు భోజనం కోసం అలమటిస్తున్నారు. ఇందుకు కారణం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.27 కోట్లు బకాయి పడడం. దీంతో వారు భోజనం వడ్డించడం మానేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక జగనన్న గోరు ముద్ద అని అమల్లోకి తెచ్చారు. కాంట్రాక్టర్లతో రివర్స్ టెండరింగ్ వేయించారు. కానీ.. బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురుచూసిన కాంట్రాక్టర్లకు నిరుత్సాహం మిగిలింది. అయితే.. ఎప్పటిలాగే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న టైమ్‌లో ఇస్తారని అనుకున్నా అది కూడా లేకుండా పోయింది. అసలు కొత్త బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. దీంతో కాంట్రాక్టర్లకు అసలు బిల్లులు వస్తాయా లేదా తెలియకుండా ఉంది.
ఫలితంగా ఇప్పుడు గురుకులాలకు ఆహారం సరఫరా చేయడం మానేశారు. దీంతో ఇప్పుడు విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లల ఆకలిని చూడలేక ఉపాధ్యాయులే అక్కడ ఇక్కడ తెచ్చిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల అయితే సెలవులు ఇచ్చి విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.
అసలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ సీజన్ వచ్చిందంటే.. తాము అమలు చేస్తున్న పథకాలకు నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తుంటుంది. కానీ.. ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడి ఆర్థిక స్థితిపై ఇప్పటివరకు ఏ లెక్క కూడా బయటికి వచ్చింది కూడా లేదు. జగన్ ప్రభుత్వం ఎందుకు అంత సీక్రెట్‌గా బడ్జెట్‌ను మెయింటెన్ చేస్తోందో కూడా ఎవరికీ అంతుబట్టని అంశం. ఇంకొంత మంది ఉద్యోగులకు కూడా ఇంకా పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పీఎఫ్, జీపీఎఫ్ సొమ్ము వాడుకున్నారనే అపవాదు కూడా ఉంది. డబ్బులు ఇవ్వడం లేదనే సాకుతో అటు రోడ్ల రిపేర్లకు కూడా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు పసిపిల్లలకు అన్నం పెట్టలేని దీనస్థితికి ప్రభుత్వం చేరుకుంది. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. కనీసం పిల్లలకు భోజనం కూడా అందివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.