తెలుగు టీవీ చరిత్రలోనే భారీగా రేటింగ్స్ సాధించిన షో బిగ్ బాస్. నిజానికి ఇది ఒక ఇంగ్లీష్ షో. ‘బిగ్ బ్రదర్’ పేరుతో అక్కడ హిట్ కొట్టిన ఈ షో.. ఆ తర్వాత మనదేశంలో మొదటగా హిందీలో మొదలైంది. ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత ఇతర భాషలకూ విస్తరించింది. తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్ 2017లో మొదలైంది. ఆ ఏడాది జూలై 16న ప్రారంభమైన ఈ గేమ్ షోలో.. దాదాపుగా ప్రముఖులే పాల్గొన్నారు. మొత్తం 16 మంది కంటిస్టెంట్లతో మొదలైన ఈ షోకు ఎంతో రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 70 రోజులపాటు ఈ షో సాగింది. అద్దిరిపోయే టీఆర్పీ రేటింగులతో దూసుకెళ్లడంతో.. ఇక బిగ్ బాస్ షోకు తిరుగులేదని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు.
సీన్ కట్ చేస్తే.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ముగిశాయి. అన్నీ.. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్ మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 5న ప్రారంభం అని గట్టి ప్రచారమే సాగుతోంది. అతి త్వరలో ప్రోమో రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే.. కంటిస్టెంట్ల మీదనే అందరి ఫోకస్ నెలకొంది. ఎవరు ఉండబోతున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నాలుగో సీజన్లో ఎంపిక చేసిన వారిపట్ల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిమంది మినహా.. మిగిలిన వారంతా షోకు వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కంటిస్టెంట్ల సెలక్షన్ పై నిర్వాహకులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఐదో సీజన్ లో.. సినిమా, టీవీ, న్యూస్, సోషల్ మీడియా.. ఇలా అన్ని కేటగిరీల్లో ఫేమస్ అయిన వారిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సారి హీరోయిన్ ఈషా చావ్లా, హీరో అశ్విన్ బాబు ( రాజుగారి గది-3), సినీ నటి సురేఖ వాణి, డ్యాన్స్ మాస్టర్ శేఖర్, సింగర్ మంగ్లీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, బుల్లితెర విషయానికి వస్తే.. యాంకర్లు రవి, వర్షిణి, విష్ణు ప్రియ, నటులు నవ్యస్వామి, సిద్ధార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. న్యూస్ యాంకర్ విభాగంలో ప్రత్యూష, సోషల్ మీడియా నుంచి టిక్ టాక్ దుర్గారావు, శణ్ముఖ్ జస్వంత్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. హోస్ట్ గా నాగ్ ప్లేస్ లో రానా వస్తున్నారని కూడా చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. ఈ సారి ఒకే ఒక్క కంటిస్టెంట్ భారీగా రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. అతనే షణ్ముఖ్ జస్వంత్. ఈ సీజన్ లో షణ్ముఖ్ కోటిన్నర రూపాయలు పారితోషికంగా అందుకోబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోటి రూపాయలు మాత్రమే. అది కూడా శ్రీముఖి మాత్రమే అందుకుంది. ఇప్పుడు ఆ రికార్డును షణ్ముఖ్ తిరగరాబోతున్నాడని టాక్. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.