Itlu Amma Movie: “ప్రేమ” సినిమాలో మ్యాగీ పాత్రలో మంచి గుర్తింపు పొందారు నటి రేవతి. రేవతి ప్రధాన పాత్రలు నటించిన చిత్రం “ఇట్లు అమ్మ”. ఈ చిత్రం ఇటీవల సోని ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. అంకురం సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డా. బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఇప్పటి వరకు 47 అవార్డులను దక్కించుకొని రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు మూవీ యూనిట్ కృతజ్ఞతలు చెప్పింది.

ఈ సందర్భంగా నిర్మాత, బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా. బొమ్మకు మురళి మాట్లాడుతూ… సోని లివ్ లో ప్రసారమవుతున్న “ఇట్లు అమ్మ” చిత్రాన్ని ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. అదేవిధంగా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఇప్పటికి ఈ సినిమాకి 47 అవార్డులు వరించాయి అని తెలిపారు. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఇంకా కథలోకి వస్తే అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి (రేవతి).
ఏ పాపమూ ఎరుగని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ తల్లిని నిద్ర పోనివ్వవు. తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసుకునే ప్రయత్నమే “ఇట్లు అమ్మ”. ఆ తల్లి హంతకుడిని కనుక్కోగలిగిందా… ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలు ఉత్కంఠ సన్నివేశాలతో అలరిస్తుంది ఈ చిత్రం. మరిన్ని విషయాలు తెలియాలంటే సోని ఓటీటీలో సినిమాని వీక్షించండి.