Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగ చొరబడి కత్తితో దాడి చేయడంతో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటన సమయంలో.. నటుడు సైఫ్, దొంగ మధ్య గొడవ జరిగింది. దాడి తర్వాత, సైఫ్ పెద్ద కుమారుడు అబ్రహం, సెక్యూరిటీ గార్డు, అతని డ్రైవర్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని వర్గాలు తెలిపాయి. సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం తప్పిందని లీలావతి ఆస్పత్రి వైద్యుల ప్రకటించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ కొనసాగించారు వైద్యులు. తర్వాత ఆస్పత్రిలోనే సైఫ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సైఫ్ ఇంట్లో క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్స్ ఆధారాలను సేకరించాయి.
పనిమనిషిని కలవడానికి వచ్చిన నిందితుడు
ఈ సంఘటనను ముంబై జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ ధృవీకరించారు. ఈ సంఘటన తర్వాత సైఫ్‌ను చికిత్స కోసం లీలావతికి తరలించామని, ఆ తర్వాత నిందితులను గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్‌లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిని కలవడానికి నిందితుడు వచ్చి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు పనిమనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు.
దాడిపై దర్యాప్తుకు 7 బృందాల ఏర్పాటు
ఈ దాడిని దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సైఫ్ ఇంటి పనిమనిషిని కూడా ప్రశ్నిస్తున్నారు. సైఫ్ శరీరంపై ఆరుసార్లు కత్తిపోట్లు పడ్డాయని, వాటిలో రెండు గాయాలు చాలా లోతుగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. “సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఆయనకు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని మేము కోరుతున్నాము. ఇది పోలీసుల వ్యవహారం” అని సైఫ్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.
పనిమనిషి స్టేట్‌మెంట్ రికార్డు
పోలీసులు ప్రస్తుతం సైఫ్ సిబ్బంది ముగ్గురు సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. పోలీసులు సైఫ్ పనిమనిషిని అనుమానిస్తున్నారు. కాబట్టి మొదట పనిమనిషికి చికిత్స చేసి, తరువాత ఆమె స్టేట్‌మెంట్ తీసుకుంటారు. దాడి చేసిన వ్యక్తి మొదట పనిమనిషిపై దాడికి దిగాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. వారిద్దరి గొంతులు విని, సైఫ్ అలీ ఖాన్ తన గది నుండి బయటకు వచ్చి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, అతనిపై ఆరుసార్లు కత్తితో దాడి చేసి ఆ వ్యక్తి పరారయ్యాడు