బాహుబలి సిరీస్ తర్వాత అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ మూవీతో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేశాడాయన. బాహుబలి రెండు పార్టుల కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడిన మన జక్కన్న.. మరో భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్ఆర్’. (రౌద్రం, రణం, రుధిరం) తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్ అడవుల్లోని కొమురం భీమ్ విప్లవ వీరులుగా మారకముందు కలుసుకుంటే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్ స్టోరీని తెరపై ఆవిష్కరించబోతున్నాడు జక్కన్న. ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసి అల్లూరి పాత్ర టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో రిలీయ్యే ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ సినిమా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చే చాన్సుంది. కాగా, ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర సమాచారం తెలిసింది. రాజమౌళి భార్య రమ ఈ సినిమాకు డైలాగ్స్ సమకూరుస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఆయన కుటుంబం మొత్తం పని చేస్తుంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. అన్న ఎంఎం కీరవాణి సంగీతం ఇస్తారు. కీరవాణి భార్య వల్లి, రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తారు. రమ కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేయడం అనవాయితీ. అయితే, ఈ పాన్ ఇండియా సినిమా కోసం రమ తొలిసారి కలం చేతపట్టిందట. ఆర్ఆర్ఆర్ కోసం ఆమె డైలాగ్స్ రాస్తున్నట్టు సమాచారం.
అయితే, ఈ సినిమాకు మాటల రచయితగా ఇప్పటికే స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా పని చేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి పాత్ర టీజర్లో ఆయన కలం నుంచి వచ్చిన మాటలు అదిరిపోయాయి. మరి, బుర్రా ఉండగా.. రమ డైలాగ్స్ రాయడం ఎందుకు? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ సాయి మాధవ్ తప్పుకున్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే రమ డైలాగ్స్ ఇస్తున్నారని అంటున్నారు. బాహుబలి 1లో సైతం ఇంటర్వెల్ వార్ సీక్వెన్స్‌కు మరో డైరెక్టర్ దేవా కట్టాతో డైలాగ్స్ రాయించుకున్నారు రాజమౌళి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడట. లాక్‌డౌన్ టైమ్‌లో ఆర్ఆర్ఆర్ స్క్రిప్టులో ఆయన కొన్ని మార్పులు చేశారని, వాటి కోసమే కొత్తగా మాటలు రాయిస్తున్నారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి, తన భార్య రాసే డైలాగ్స్‌ను ఏ పాత్రకు, ఏ సన్నివేశానికి వాడుతారనేది ఆసక్తికరం. కాగా, ఈ మధ్యే కరోనా మహమ్మారిని జయించిన రాజమౌళి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని తమ ఫామ్‌హౌజ్‌లో ఉంటోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే సన్నాహకాల్లో ఉన్నారు జక్కన్న.