Nagarjuna: హైదరాబాద్ లో అక్కినేని నాగార్జునకి ఊహించని పరిణామం ఎదురైంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో దూకుడుని ప్రదర్శిస్తున్న హైడ్రా, మాదాపూర్ లోని నాగార్జునకి చెందిన N కన్వెషన్ సెంటర్ ని కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా ఈ కార్యక్రమం చేపడుతోంది. గతంలో నాగార్జున ఇక్కడ మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించినట్టు తెలుస్తుంది. అక్రమ కట్టడాల పై ఉక్కుపాదం మోపిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున తో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా, ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ కట్టడాన్ని హైడ్రా తో కూల్చివేసేలా చేసాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సతీసమేతంగా అమలతో కలిసి ఆయన వద్దకి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేసాడు నాగార్జున.
ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ఈ N కన్వెషన్ గురించి చర్చకి వచ్చిందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియా లో నాగార్జున రేవంత్ రెడ్డి ని కలవడానికి ముఖ్య కారణం తన అక్రమ కట్టడాలను కాపాడుకోవడం కోసమే అని అప్పట్లో ఒక టాక్ నడిచింది. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఈరోజు జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా నాగార్జున ఆస్తులపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని కట్టడాలను ఆ ప్రభుత్వం కూడా కూల్చేసింది. నాగార్జున ఉద్దేశపూర్వకంగా ఆక్రమించి ఈ కట్టడాలను కట్టించి ఉండకపోవచ్చు కానీ, ఆయనకి ఈ స్థలాలు అమ్మిన వారు మాత్రం అన్నీ తెలిసే చేసి ఉండొచ్చు అని నాగార్జున అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే, త్వరలోనే ఆయన స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి.
సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. ఆఫీసర్ చిత్రం నుండి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, ఆ ఫ్లాప్ చిత్రాలు కనీసం 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం, అభిమానులకు తీవ్రమైన నిరాశ కలిగించాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కానీ, నాగార్జున రేంజ్ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తుండగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.