Krishnam Raju Political Rise: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మొదట హీరోగా నటించినా తరువాత ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించారు. పిమ్మట హీరో పాత్రలు దక్కడంతో తనలోని నటనకు ప్రాణం పోశారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణించారు. ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి సేవలందించారు. తన జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటారు. క్షత్రియ కుటుంబంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940లో జన్మించారు.

మొదట ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. తరువాత ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాద్ లో రాయల్ స్టూడియో స్థాపించారు. స్నేహితుల సూచన మేరకు సినిమాల్లో చేరి తనదైన శైలిలో నటనలో రెబల్ స్టార్ గా నిలిచారు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు చిత్రాలు నిర్మాణం చేపట్టారు. గోపికృష్ణ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి పలు చిత్రాలు నిర్మించారు. వెండితెరను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి వాళ్లు ఏలుతున్న సమయంలో వచ్చిన కృష్ణం రాజు అనతికాలంలోనే తానేమిటో నిరూపించుకున్నారు.
ఎస్వీ రంగారావు లాంటి సీనియర్ నటుల ప్రశంసలు అందుకున్న కృష్ణంరాజు అటు కుటుంబ కథా చిత్రాలతోపాటు భక్తిరస చిత్రం భక్త కన్నప్పలో తన నటనకు జీవం పోశారు. తాండ్రపాపారాయుడులో చారిత్రాత్మక చిత్రంలో నటించారు. ధర్మతేజ, ధర్మాత్ముడు, రంగూన్ రౌడీ, త్రిశూలం, పులిబెబ్బులి, బొబ్బిలిబ్రహ్మన్న వంటి ఎన్నో చిత్రాల్లో తన నటనకు కొత్త భాష్యం చెప్పారు. కృష్ణ, కృష్ణం రాజు కలిసి దాదాపు 17 చిత్రాల్లో నటించి మంచి జంట అని శభాష్ అనిపించుకున్నారు. తనకు వారసులు లేకపోవడంతో తమ్ముడి కొడుకు ప్రభాస్ ను తన వారసుడిగా రంగ ప్రవేశం చేయించి ఆయనను కూడా మంచి నటుడిగా తీర్చిదిద్దారు.

రాజకీయాల్లో కూడా తన ప్రస్థానం కొనసాగించారు. మొదట కాంగ్రెస్ లో 1991లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత బీజేపీలో చేరి 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్ పేయి ప్రభుత్వం ఒక ఏడాదిలోనే అధికారం కోల్పోవడంతో 1999లో నరసాపురం ఎంపీగా మరోమారు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై విజయం సాధించి రికార్డు సృష్టించారు. రెండోసారి గెలవడంతో కేంద్ర మంత్రి పదవి వరించింది. వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. దీంతో బీజేపీలో చేరడంతో తన దశ కలిసొచ్చింది. విజయం దక్కడంతో ఆయనకు మంత్రి పదవి రావడంతో ఇక తిరుగులేని నేతగా ఎదిగారు. 2000 నుంచి 2004 వరకు వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసి అందరిని మెప్పించారు.
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మళ్లీ 2013లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తున్నారనే వార్తలు అప్పట్లో వచ్చినా అది సాధ్యం కాలేదు. లోక్ సభ సభ్యుడిగా ఉన్న కాలంలోనే వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1998 నుంచి 1999 వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కన్సలెటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాల్లో కూడా సుదీర్ఘమైన అనుభవం ఉన్న నేతగా ఎన్నో పదవులు నిర్వహించారు.
కృష్ణం రాజు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఓ ధృవతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో తనదైన నటనతో అందరిని మెప్పించిన నటుడిగా కృష్ణం రాజు సేవలను పలువురు శ్లాఘించారు. కృష్ణం రాజు మరణంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.