Krishnam Raju: కృష్ణంరాజు.. పేరు చివరన ఉన్న రాజు తాలూకూ లక్షణాలను తుది కంటా పాటించాడు. అజాతశత్రువు అని నలుగురు అనుకునేలా ప్రవర్తించాడు. ఏ ఒక్కరి దాంట్లో వేలు పెట్టలేదు. ఆరడుగుల అందగాడైనా ఏ నటి మణి తో వ్యవహారాలు సాగించలేదు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలు తీశాడు. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాడు. అడుగుల పొడవు, రౌద్రమైన రూపం ఉండటంతో మాస్ హీరోగా చెలరేగిపోయాడు. బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, కటకటాల రుద్రయ్య ఆయనను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆయనలో ఉన్న మాస్ ఎలిమెంట్ ని బయటకు తీసుకువచ్చింది మాత్రం దాసరి నారాయణరావే. భక్తకన్నప్ప సినిమా ఆయనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసింది. మాస్ హీరో కావడంతో సరిగా స్టెప్పులు పడేవి కావు. రాజకీయాల్లో కూడా ఆయన స్టెప్పులు అలాగే ఉన్నాయి. మొదట్లో కాంగ్రెస్ నుంచి రాజకీయాలు చేశాడు. ఆ తర్వాత బిజెపిలో చేరాడు. తర్వాత ప్రజారాజ్యం.. మళ్లీ ఇప్పుడు బీజేపీ.. స్వతహాగా సాత్వికుడైన కృష్ణంరాజు.. రాజకీయాల్లోనూ అదే ధోరణి అవలంబించారు. ఎక్కువ పరిగెత్తలేదు. అలాగని కూర్చోలేదు. పదవుల కోసం పిచ్చి గంతులు వేయలేదు. ప్రత్యర్థులతోని ఛీ పోరా అని తిట్టించుకోలేదు. సినిమా పరిశ్రమ అంటేనే టన్నుల కొద్ది హిప్పోగ్రసీ, క్వింటాలకొద్దీ ఈగో ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు పై వాటిని తన దగ్గరికి రానివ్వకుండా కృష్ణం రాజు చూసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య గొడవలు ఉండేవి. కానీ వారంతా కృష్ణంరాజు అభిమానులతో సఖ్యతగా ఉండేవారు. ఎలాంటి పాత్రలైనా ఏ మాత్రం సంకోచం లేకుండా చేసేవాడు కాబట్టే మిగతా హీరోల అభిమానులు ఆయనను అభిమానించేవారు.

సినీ రంగంలోకి రావడమే సంచలనం
చదువు పూర్తి గాకుండానే కృష్ణంరాజు జర్నలిస్టుగా పనిచేశాడు. తర్వాత రాయల్ ఫోటో స్టూడియో పెట్టి ఫోటోగ్రాఫర్ గా పని చేశాడు. వాస్తవానికి సినిమాలోకి రావడం కంటే ఆయనకి ఫోటోగ్రాఫర్ గా పని చేయడమే ఇష్టం. అయితే చుట్టూ ఉన్నవాళ్లు ప్రోత్సహించడంతో అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే దొరికిన పాత్రల్లా చేశాడు. ఎన్టీఆర్ తో భలే మాస్టారు, బడిపంతులు, వాడే వీడు, పల్లెటూరి చిన్నోడు, మనుషుల్లో దేవుడు, మంచికి మరో పేరు అనే సినిమాల్లో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు తో బుద్ధిమంతుడు, పవిత్ర బంధం, జై జవాన్, మంచి రోజులు అనే సినిమాల్లో నటించాడు. మల్టీ స్టారర్ సినిమాల్లోనూ పెద్దగా ఈగో చూపించేవాడు కాదు. అందుకే మిగతా హీరోలు తమ ఫస్ట్ ఛాయస్ గా కృష్ణంరాజు వైపే చూసేవారు. అంతటి ఆజాత శత్రువు కాబట్టి అందరి హీరోల సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ లో నటించాడు. శోభన్ బాబు తో అయితే 17 సినిమాల్లో స్క్రీన్ పంచుకున్నాడు. బయట కూడా వీరిద్దరూ మంచి మిత్రులు. ముందుచూపుతోనే భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు.
భోజన ప్రియుడు కూడా
గోదావరి జిల్లా వాళ్లకు తిండి మీద యావ ఎక్కువ. పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యుడు కావడంతో కృష్ణంరాజు స్వతహాగా భోజన ప్రియుడు. నాటుకోడి మాంసం, చేపలు, రొయ్యలు మహా ఇష్టంగా తినేవాడు. తినడమే కాకుండా తోటి నటీనటులకు ఇంటి నుంచి భోజనాలు వండించుకుని వడ్డించేవాడు. ఈయన తెచ్చే భోజనం కోసం అప్పటి హీరోయిన్లు చంద్రకళ, జయసుధ, జయప్రద, జమున, శారద వంటి వారు ఎదురుచూసేవారు అంటే అతిశయోక్తిగాక మానదు. శోభన్ బాబు ను కూడా తన ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి ఆంధ్ర వంటకాలు వండించి కొసరి కొసరి వడ్డించేవాడు. ప్రస్తుతం ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ప్రభాస్ కొనసాగిస్తున్నాడు. ” దేవుడా నువ్వు నాకిచ్చిన ఈ మానవ జన్మలో ఎవరికీ ద్రోహం చేయలేదు. ఇబ్బంది కలిగించలేదనుకుంటూ ఒక పచ్చని చెట్టు కింద కూర్చుని ఎడమవైపు ఉన్న గుండెను కుడి చేతితో పట్టుకొని ఆనందంగా కళ్ళు మూయాలి” ఇది నా చివరి కోరుకుంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో కృష్ణంరాజు అన్నారు. అన్నట్టు అలాగే కన్నుమూశారు.