Razakar Movie OTT: అనసూయ భరద్వాజ్, బాబీ సింహ, ఇంద్రజ, వేదిక, ప్రేమ వంటి స్టార్ క్యాస్ట్ నటించిన చిత్రం రజాకార్. వాస్తవ సంఘటనల ఆధారంగా రజాకార్ మూవీ తెరకెక్కింది. నైజాం పాలనలో హైదరాబాద్ లో చోటు చేసుకున్న పరిస్థితులను రజాకార్ మూవీలో తెలియజేశారు. రజాకార్ మూవీ అనేక వివాదాలు రాజేసింది. ఓ వర్గం మనోభావాలు దెబ్బ తినేలా మూవీని చిత్రీకరించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు సినిమాలో ఉన్నాయి. చరిత్రను వక్రీకరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ మూవీ తెరకెక్కించారని కొన్ని పార్టీలు ఆరోపించాయి.
రజాకార్ విడుదలను అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. కోర్టుల్లో కేసులు వేశారు. అన్ని లీగల్ సమస్యలు అధిగమించి రజాకార్ మూవీ 2024 మార్చ్ 15 మూవీ విడుదలైంది. రజాకార్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. పెద్దగా ఆడలేదు. రజాకార్ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బీజేపీ ఎమ్మెల్యే గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు.
కాగా రజాకార్ డిజిటల్ రైట్స్ ఆహా కొనుగోలు చేసింది. థియేటర్స్ లోకి వచ్చిన పది నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. జనవరి 24 నుండి ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. రజాకార్ మూవీ కథ విషయానికి వస్తే..
నైజాం(హైదరాబాద్) వందల ఏళ్ళు నిజాం నవాబుల పాలనలో ఉంది. ఇండియాకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అయితే అఖండ భారతదేశంలో కలిసేందుకు ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ని భారతదేశంలో కలిపేందుకు నిరాకరిస్తాడు. తన పాలనలో హిందువులపై అకృత్యాలకు పాల్పడతాడు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ యోధులు పోరాటం సాగిస్తారు. రజాకార్ల పై పోరాడేందుకు నైజాం యోధులు భారత ప్రభుత్వం సహాయం కోరతారు. హోమ్ మినిష్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. నెహ్రూ సహకరించకపోవడంతో ఆయన ముందుకు వెళ్ళలేరు. చివరికి నిజాం పాలన నుండి ప్రజలకు విముక్తి ఎలా కలిగింది అనేది కథ..