Rao Ramesh: లెజండరీ నటుడు రావు గోపాల రావు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రావు రమేష్, ఎన్నో వందల చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి, తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రావు రమేష్ నటన, ఆయన డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఇలా ఆయనలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో అలరించే విధంగా ఉంటుంది. ఎంతమంది టాలెంటెడ్ కొత్త క్యారక్టర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా ఇప్పటికీ మంచి డిమాండ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్న రావు రమేష్ రీసెంట్ గా ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ఇది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా విచ్చేసి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చాడు. ట్రైలర్ కూడా విడుదలకు ముందు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి అంచనాలతోనే ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రిపోర్ట్ అందుకున్న ఈ సినిమా విజవంతంగా థియేటర్స్ లో నడుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షో ని మూవీ యూనిట్ తో కలిసి , కొంతమంది ప్రేక్షులతో రామానాయుడు స్టూడియోలో చూసిన రావు రమేష్, బయటకి వచ్చిన తర్వాత భావోద్వేగానికి గురి అయ్యాడు. డైరెక్టర్ లక్ష్మణ్ ని దగ్గరకి తీసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రావు రమేష్ ఎన్నో వందల సినిమాలు చేసాడు , ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు, ఎంతో గొప్ప పేరు కూడా సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడూ కూడా ఇంత ఎమోషనల్ అవ్వని రావు రమేష్ ఈ సినిమాకి అయ్యాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఈ సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యాడు అనేది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మధ్య తరగతి కి చెందిన మధ్యవయస్కుడి నిరుద్యోగ కష్టాలు, దాని వల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశం పై డైరెక్టర్ లక్ష్మణ్ చాలా చక్కగా ఈ చిత్రంలో చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, వినోదం కూడా ఉండేవిధంగా బ్యాలన్స్ చేస్తూ డైరెక్టర్ లక్ష్మణ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. చిన్న సినిమా అవ్వడంతో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా తక్కువకే జరిగింది. కాబట్టి వీకెండ్ కి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన రావు రమేష్, హీరో గా కూడా సక్సెస్ ని అందుకోవడం విశేషం.