RGV: రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచి, డిఫరెంట్ పబ్లిసిటీ కి పేటెంట్ గా మారిన డైనమిక్ డైరెక్టర్. కాదు కాదు డైనమైట్ లాంటి డైరెక్టర్. ఆర్ జీవికి సింగిల్ లైన్ చాలు సినిమా తియ్యడానికి, దేశంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ చాలు సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కించడానికి.. టేలెంట్ కి కొదువులేదు, ఆయన చేసే ట్వీట్లకు అంతకంటే హద్దూ అదుపూ లేదు. భయం బెరుకు అంతకన్నాలేదు. వివాదాలు ఆయనకు కొత్తకాదు, వివదాలు సృష్టించి తన ప్రాజెక్ట్స్ కు వినూత్న పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయనకు మించిన ఘణాపాటి ఇండస్ట్రీలో ఇంకొకరు లేనేలేరు..

ఆయన చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అవుతుంది, నిముషాల్లో ఆయన ఇంటర్వ్యూల పేరుతో స్టూడియోలలో ప్రత్యక్షమవుతాడు. పబ్లిసిటీలో ప్రస్తుతం ఇదో నయా ట్రెండ్.
ప్రజాసంఘాలు గోల చేసినా పట్టించుకోడు, ప్రజా ప్రతినిధులు బెదించినా ఐ డోన్ట్ కేర్ అంటాడు. గందపు చెక్కల దొంగ వీరప్పన్ బయోపిక్ మొదలు ఎవరూ టచ్ చేయని ప్రాజెక్టులను టేకప్ చేసే ఆర్ జీవి కొండా దంపతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న కొండా సినిమా నేపథ్యంలో మరో వివాదానికి కేంద్ర బిందువయ్యాడు ఆర్ జీవి..
ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అంటూ కోట గండి మైసమ్మకు విస్కీ చుక్కను తాగించి మరో వివాదంలో చిక్కుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. వరంగల్ గీసుకొండ మండలం కోట గండి మైసమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన వివాద దర్శకుడు ఆర్ జీవి అమ్మవారి విగ్రహానికి విస్కీ తాగించడమే కాకుండా దాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైగా రోజూ ఓడ్కా తాగే నేను అమ్మవారికి విష్కీ తాగించానని ట్వీట్ చేశాడు. వార్నీ ఆర్ జీవి నీ పబ్లిసిటీ పాడుగాను ఇదేం పాడుపనిరా బాబూ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.. అయినా ఆర్ జీవి వింటాడా? విన్నా మాత్రం పట్టించుకుంటాడా?
కొండా సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా హన్మకొండ నుంచి వంచనగిరికి కొండా అభిమానులు, ఆర్ జీవి అభిమానుల మధ్య ర్యాలీ చేయాల్సి ఉంది దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మనోడు ఈ విధంగా తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పిచ్చి పీక్స్ కి వెళ్తే పబ్లిసిటీ ఎలాగైనా చేసుకోవచ్చు అనే దానికి ఇదో ఉదాహరణ.