Ram Charan Tweet: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హిందూవాదులు ఆయనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొందరైతే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వ్యక్తికి బహుమతి అంటూ రాడికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై హీరో రామ్ చరణ్ స్పందించారు. ఆయన పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ఖండించారు. సనాతన ధర్మానికి మద్దతుగా నిలిచాడు.
రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. తల్లి సురేఖ పూజలు నిర్వహిస్తున్న ఫోటో తో పాటు ”సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మం” అని ట్వీట్ చేశాడు. దీంతో రామ్ చరణ్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ని ఖండించినట్టైంది. ఇక రామ్ చరణ్ అభిప్రాయంపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారో పరిశీలిస్తే… తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం ‘సనాతన ధర్మం నిర్మూలన’ అనే అంశం మీద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్… సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. సనాతన ధర్మం దోమ వంటిది. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. దోమలను ఎలా అంతం చేస్తామో… సనాతన ధర్మాన్ని కూడా అంతం చేయాలని అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు దారి తీశాయి. అయితే ప్రకాష్ రాజ్ వంటి నటులు ఆయనకు మద్దతు తెలిపారు. సనాతన ధర్మం ఆమోద యోగ్యం కాదు. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో మత విద్వేషాలు లేపడానికి వాడుతున్నారని అంటున్నారు. మొత్తంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తో ఆయన్ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి.
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత…. #Bharathiya_Culture_Matters pic.twitter.com/Mi5Bl3k8nY
— Ram Charan (@AlwaysRamCharan) September 11, 2020