Producer Dil Raju: టాలీవుడ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ప్రొడ్యూసర్ ఎవరయ్యా అంటే కచ్చితంగా దిల్ రాజు పేరు మొదటి వరసలో వినిపిస్తుంది. తెలుగు పరిశ్రమలో అత్యంత తెలివైన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు టాలీవుడ్ పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగాడు. నిజామాబాద్ నర్సింగ్ పల్లి గ్రామంలో జన్మించిన ఆయన సినిమా రంగం మీద ఇష్టంతో డిస్ట్రిబ్యూటర్ గా రంగప్రవేశం చేసి ఆ తర్వాత దిల్ సినిమా తో నిర్మాతగా మారి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
తాజాగా జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పోటీచేసి 45 స్థానాల్లో 31 స్థానాలు గెలిచి ఛాంబర్ అధ్యక్షుడు అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు సాదాసీదాగా జరిగే ఎన్నికలు. వీటిని ప్రధాన ఎన్నికలు అన్నట్లు చూడకండి. ప్రస్తుతానికి నేను ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకే ప్రాధాన్యత ఇస్తున్న, నేను నిజమైన ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ గా లేదా ఎమ్మెల్యే గా గెలుస్తా అంటూ పొలిటికల్ కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజానికి ఈ సమయంలో పొలిటికల్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయాల మీద తనకు ఆసక్తి ఉందని మరోసారి మీడియా సాక్షిగా వెల్లడించినట్లు అర్ధం అవుతుంది. ఎప్పటినుండో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేయాలని దిల్ రాజు ఆలోచనలో ఉన్నాడు. నిజామాబాద్ ఎంపీ లేదా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గా బరిలో దిగాలని చూస్తున్నాడు. అటు BRS ఇటు కాంగ్రెస్ పార్టీల కీలక నేతలతో మంచి సంబంధాలే నెరుపుతున్నాడు.
తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా పొలిటికల్ వేవ్స్ ను గమనిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరికి తన మద్దతు ఇవ్వాలి. అదే విధంగా తాను అనుకుంటున్నా స్థానాల్లో తనకు టికెట్ ఇచ్చే పార్టీ ఏమిటి..? వాటి బలాబలాలు ఏమిటి ? అనే వాటిపై గట్టిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. నిజామాబాద్ లోకసభ నుండి BRS తరఫున కేసీఆర్ కూతురు కవిత రెండు సార్లు పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పక్కన సీనియర్ నేత మధు యాష్కీ రేస్ లో ఉన్నాడు.
ఇక నిజామాబాద్ రూరల్ విషయానికి వస్తే BRS తరపున ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పక్కన ఈ టిక్కెట్ కోసం గట్టి పోటీనే ఉంది. డాక్టర్ భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి మరియు నగేష్ రెడ్డి లు ఈ టిక్కెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. నగేష్ రెడ్డి హీరో నితిన్ కు మేనమామ. నితిన్ కుటుంబానికి దిల్ రాజు కు మంచి సంబంధాలు ఉన్నాయి. అవసరం అయితే నగేష్ రెడ్డి మద్దతు కూడా దిల్ రాజుకు ఉండే అవకాశం లేకపోలేదు. త్వరలో తెలంగాణ ఎన్నికల శంఖారావం మోగుతుంది. కాబట్టి అతి త్వరలోనే దిల్ రాజు రాజకీయ ప్రవేశం గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.