సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల వల్ల ఎంతో వేదనను అనుభవిస్తున్నామని తెలియజేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఓ లేఖ రాశారు.
బన్నీవాసు రాసిన లేఖ….
‘‘గౌరవనీయులైన సుందర్ పిచ్చయ్‌గారికి,
మీరు ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద ప్రచురించిన అభిప్రాయాన్ని నేను చదవటం జరిగింది. గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ అయిన మీరు ఎంతో ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు అని నా నమ్మకం. ఈ విషయం మీద నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకోవటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను.
సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నేను కూడా నా ఆలోచనా విధానాలు, భావాలూ పంచుకోటానికి ఇది మంచి వేదిక అని నమ్మాను, అలానే భావ ప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని కచ్చితంగా అనుకున్నాను. ఈ నమ్మకంతోనే సామాజిక మాధ్యమాలను ఆనందంగా ఉపయోగించాను. కానీ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా నేను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పటం వలన సామజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని నా నమ్మకం. ఇది ప్రభుత్వాలకో లేదా రాజ్యాలకో లేదా సమాజానికో సంబంధించిన విషయం అయితే వేరు కానీ, ఈ ఇంటర్నెట్ ఫ్రీడం చాటున ఉన్న సామాజిక మాధ్యమలలో లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తికత జీవితానికీ, తన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం అయితే, ఆ వ్యక్తికీ తన కుటుంబానికి జరిగే నష్టం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . పైగా ఆ పరువు ఎంతమంది దగ్గర పోయిందో కూడా చక్కటి లెక్కలతో సహా చెబుతారు ఈ వేదిక నిర్వహించే కంపెనీలు. సామాజిక మాధ్యమాలలో ఉంటున్న వాళ్ళందరూ విచక్షణతో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్ళనే సామాజిక మాధ్యమాలలోకి అనుమతిస్తున్నారా? ఈ ప్రశ్నని ఒకసారి మీరు మిమ్మల్ని అడిగి చూడండి ? సామాజిక మాధ్యమాలు అందరికి అందుబాటులో ఉంచాలి అని అన్నా, కనీసం విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కట్టడి చేయటానికి సమర్థవంతమైన విధానాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఒక విచక్షణ లేని వ్యక్తి వలన ఇబ్బంది పడుతున్న నేను, నా కూతురు, దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ ఉత్తరం రాస్తున్నాను. అబద్ధాలనూ అసత్యాలనూ పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడ్తున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న క్రూరమైన పనులను నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని అడిగితే సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఒక వేదిక అందించటం మాత్రమే మేము చేస్తున్నది అని ఈ వేదికలు తపించుకోవచ్చు, కానీ ఈ విచ్చలవిడి స్వేచ్చకి బలైపోతున్న మాలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చేది ఎవరు? న్యాయబద్దత, అవధులు, సరైన విచారణ లేని వార్తలు, పోస్టులు, కామెంట్లను అనుమతిస్తున్న ఇప్పటి సామజిక మాధ్యమాల వలన బలైన నేను, నా ఆరు సంవత్సరాల కూతురి ఆవేదనే ఈ ఉత్తరం.
సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించే మన భారత దేశంలో, అందులోనూ కుటుంబ గౌరవమే అతి ప్రాముఖ్యంగా భావించే మధ్యతరగతి కుటుంబాల కోసం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి భారత దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ చాటున సామాజిక మాధ్యమాలలో ప్రజలు తమ భావాలను, సామాజిక అంశాలను చర్చించటానికి ఎంత ఉపయోగపడ్తున్నాయో పక్కన పెడితే, కొంతమంది మానసికంగా కలత చెంది నియంత్రణ లేని వ్యక్తుల వెక్కిలి చేష్టలకు మాత్రం మంచి వేదికగా మారింది అనేది మనం కాదనలేని సత్యం.
ఇంటర్నెట్లో భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది కేవలం కత్తికి ఒకవైపు ఉండే పదును మాత్రమే కానీ అదే కత్తికి రెండో వైపు ఉండే పదునుకి అడ్డు, వ్యక్తిగత సమాచార విశ్లేషణ పాటు తప్పనిసరిగా ఉండవలసిన విధులు. ఒకవైపు పదును ప్రశ్నించటానికి, భావాలను తెలియజేయటానికి ఉపయోగపడితే రెండో వైపు పదును మాత్రం నియంత్రణ లోపం వలన ఎన్నో జీవితాలు తెగ్గోస్తుంది. అలాంటి చేదు అనుభవము, ఆవేదనతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎంత మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో వాళ్ళ ప్రమేయంలేకుండా అప్ లోడ్ చేయబడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయో రోజు చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆరాచకులు వాళ్ళ వాంఛలు తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సామజిక మాధ్యమాలలో ప్రచురిస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న తరుణాలు కోకొల్లలు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న నేను, నా కూతురిని చంపుతానని ఒక మానసిక స్థిమితం లేని సైకో ఒక సామాజిక మాద్యమంలో వీడియో పెడితే, అది తీయించటానికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. నాలాంటి వాడికే ఇంత కష్టం అయితే ఇంక సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇది చదివిన వెంటనే మీ మదిలోకి వచ్చే ఆలోచన “మరి ఇలాంటివి జరిగినపుడు, సామాజిక మాధ్యమాలలో ఉండే కంప్లైంట్ సెల్లో ఫిర్యాదు చేయచ్చు కదా?”, కానీ నేను సామాజిక మాధ్యమాల కంప్లైంట్ సెల్లో ఇచ్చినన్ని ఫిర్యాదులు పోలీసులకు కూడా ఇవ్వలేదు. కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే ఒకరు ప్రచురించిన పోస్ట్ లేదా న్యూస్ అబద్ధం అని నిరూపించటం సామాజిక మాధ్యమాలలో కన్నా ఇండియన్ కోర్ట్లలోనే చాలా సులువు. అందుకే కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్నాను.
పూర్వం ఒక వ్యక్తి పరువు తీయాలి అంటే ఎంతో కష్టపడే వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక మార్ఫింగ్ చేసిన ఫోటో లేదా అసభ్య భాష వస్తే చాలు ఎవరిని అనుకుంటే వాళ్ళ పరువు తీసేయచ్చు, వాళ్ళ జీవితం నాశనం చేయవచ్చు. ఎందుకంటే సామజిక మాధ్యమాలలో అవధులు లేకపోవటం. అంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే ఇది ఒక వీధికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనుకున్న వ్యక్తి పరువు తీయచ్చు. ఒకరు ఈ సమాచారం తప్పు అని నిరూపించి దానినుంచి బయటకు రావటానికి జీవితం మొత్తం అయిపోతుంది. ఒక పద్దతి, కట్టుబడి, నియంత్రణ లేని సమాచారం సమాజంలో నగ్నంగా నిలుచోపెట్టిన మనిషి లాంటిది. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇంటర్నెట్ చట్టాలు, సమాచారం అనే మనషి కి బట్టలు కడతాయి ఏమో చూడాలి.
భావప్రకటనా స్వేచ్ఛ అనే పదును వైపు పెడుతున్న మీ శ్రద్ద అవతలి పదును వైపు కూడా పెడితే బాగుంటుంది. మేము పెడుతున్నాము అని అనుకోవచ్చు కానీ దాని సమర్థత వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది ??
ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ తమ కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ ఉత్తరం అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది.
ఇట్లు,
బన్నీ వాసు
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Producer bunny vasus letter going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com