KTR- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ కష్టాలు తీరడం లేదు. ఇందులో రాజకీయ వైషమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇటీవల విడుదలైన భీమ్లానాయక్ సినిమాపై ప్రభావం చూపుతున్నాయి. గతంలోనే ఏపీలో వైసీపీ నిర్ణయాలపై నిరసన గళం విప్పిన పవన్ కల్యాణ్ కు ఎవరు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఇటీవల చిత్రపరిశ్రమ పెద్దలు సీఎం జగన్ ను కలిసి సినిమా రంగాన్ని బతికించాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వంలో సానుకూల స్పందన వస్తుందని ఆశించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ఓ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా వ్యక్తుల్లో మంచి గుణం అనేది ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని పేర్కొనడం గమనార్హం. చలనచిత్ర పరిశ్రమ కోసం తెలంగాణ చేస్తున్న సాయాన్ని కొనియాడారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ కోసం ఆయన పట్టించుకునే తీరుకు పవన్ కల్యాణ్ స్పందించడం అభినందనీయమన్నారు.
Also Read: అమెరికాలో హాఫ్ మిలియన్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్న భీమ్లానాయక్
పవన్ కల్యాణ్ రాసిన లేఖలో అన్ని అర్థాలే. వెతుక్కుంటే ఎన్నో దొరుకుతాయి. జగన్ ను విమర్శించే కన్నా కేటీఆర్ ను పొగడటం అంటే పుట్టలో ఉన్న పామును బయటకు రప్పించడానికి కలుగులో పొగపెట్టినట్లే. రాజు రెండో భార్య మంచిదంటే మొదటి భార్య చెడ్డదనే అర్థంలో పవన్ కల్యాణ్ వ్యవహారం కనిపిస్తోంది. మొత్తానికి తాను చెప్పదలుచుకున్నది చెబుతూ ఎదుటి వారిలోని తప్పులను వేలెత్తి చూపడంలో పవన్ ప్రత్యేకతే వేరు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునే వారికి సమాధానం చెప్పేందుకే ఆయన నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగానే ఆయన లేఖ ద్వారా జగన్ కు కూడా సందేశం పంపినట్లు అవుతోంది. సినిమా రంగాన్ని టార్గెట్ చేసుకుని జగన్ మరింత చులకన అయిపోతున్నా పట్టించుకోవడం లేదు. కళల పట్ల మక్కువ ఉన్న వారు చేసే పని కాదని తెలుస్తున్నా ఆయనలో మార్పు రావడం లేదు. అందుకే పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ను స్తుతిస్తూ లేఖ రాయడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పక్క రాష్ట్రమైనా మన కోసం పరితపించే వారిని ప్రశంసించడంలో తప్పేమీ లేదని తెలుస్తోంది. దీనికి స్పందించే మనస్తత్వం ఉండాలని చెబుతున్నారు.
మొత్తానికి పవన్ కల్యాణ్ లేఖ రెండు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి వంత పాడటంతో ఏపీలో వైసీపీ నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పవన్ కల్యాణ్ తీరుకు విమర్శలు చేస్తున్నారు. పవన్ కు ఏం తక్కువైందని ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. కానీ వైసీపీని టార్గెట్ చేసుకుని పవన్ మరింత రెచ్చిపోతారని తెలుస్తోంది.
Also Read: రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?