
గత జనవరిలో థియేటర్లు ఓపెన్ కాగానే ఉప్పెన నుంచి ‘వకీల్ సాబ్’ దాకా థియేటర్లలోనే విడుదల చేసి నిర్మాతలు కాసులు కురిపించుకున్నారు. అయితే సడెన్ గా వచ్చిపడిన కరోనా సెకండ్ వేవ్ తో నిర్మాతల ఆశలు అడియాసలయ్యాయి. వారు థియేటర్లపై ఆశతో భారీగా ఆఫర్ చేసిన ఓటీటీలను కాలదన్నేశారు. ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక సినిమాలు తీసిన నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఓటీటీలు ఇచ్చిన భారీ ఆఫర్లను కోల్పోవడం గురించి నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు
నేచురల్ స్టార్ నాని ఇటీవల తీసిన చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని ఇప్పటికే పునరుద్ఘాటించారు. ఇక విశ్వక్ సేన్ తన చిత్రం “పాగల్” డైరెక్ట్-ఒటిటి విడుదలకు అంగీకరించనని ఈ చిన్న హీరో కూడా బీరాలకు పోయాడు. రవితేజతో తీసిన “ఖిలాడి” మూవీ నిర్మాతలు కూడా థియేటర్లనే ఎంచుకున్నారు.
హీరోలు తమ సినిమాలను ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ గా చూపించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. హీరోలకు థియేటర్లలో విడుదలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ ఇప్పుడు నిర్మాతలు ఓటీటీ నిర్వాహకుల నుంచి ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
చిన్న సినిమాలు ప్రదర్శించడానికి ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. వారు మీడియం హీరోల సినిమాలు.. పెద్ద తారలతో ఉన్న చిత్రాలను ఎంత రేటు అయినా పెట్టి కొనడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్ , నెట్‌ఫ్లిక్స్ లాంటి భారీ ఓటీటీలు పైన పేర్కొన్న సినిమాల నిర్మాతలతో చర్చలు ప్రారంభించాయి.
ఓటిటి నిర్వాహకులకు వీరి సినిమాలకు భారీ రేట్లతో కొత్త కొటేషన్ల ఇస్తూ నిర్మాతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. డైరెక్ట్-డిజిటల్ విడుదలకు ఆయా సినిమాల హీరోలు అంగీకరించే వరకు నిర్మాతలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం లేదు. హీరోలు మాత్రం థియేటర్లలో రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు.