Bihar : బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా గంగాపూర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ యువతి నర్స్ గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఆమె తన విధులు ముగించుకుంది. ఇంటికి వెళుతుండగా ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ సంజు, అతడి సహచరులు సునీల్ కుమార్ గుప్తా, అవదేశ్ కుమార్ ఆమెను అటకాయించారు. ఆమెను వేధించడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో వారు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో డాక్టర్ సంజయ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పక్కకు లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అతడిని నెట్టివేసింది. అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమె పరిగెత్తుతూ ఉండగా డాక్టర్ సంజయ్, అవదేశ్ ఆమె వెంట పడ్డారు. దీంతో ఆమె వారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. సంజయ్, అవదేశ్ ఆమెను ఇబ్బంది పడుతుండగా చేతికి దొరికిన సర్జికల్ బ్లేడ్ తో సంజయ్ మర్మాంగాన్ని కోసింది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయింది. అయినప్పటికీ సంజయ్, అవదేశ్ ఆమెను విడిచిపెట్టలేదు. చివరికి ఆమె ఒక నిర్మానుష్య ప్రాంతంలో దాక్కుని.. ఎమర్జెన్సీ నెంబర్ 112 కు ఫోన్ చేసింది. పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై క్షణాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గాయపడిన ఆ వైద్యుడు, ఇతరులు గోప్యంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆసుపత్రిలో రక్తంతో తడిసిన బెడ్ షీట్లు, సర్జికల్ బ్లేడు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనకు ముందు ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కేసు విచారణ నిమిత్తం పుటేజి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బీహార్ రాష్ట్రంలో కలకలం
కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఘటనను మర్చిపోకముందే ఈ దారుణం చోటు చేసుకోవడం బీహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోలీసులను ఆదేశించారు.. అయితే గత కొంతకాలంగా ఆ వైద్యుడు ఆ నర్స్ ను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ పరిస్థితి బాగోలేక.. మరోచోట ఉద్యోగం లభించక.. ఆమె మౌనంగా భరిస్తున్నట్టు సమాచారం. తన కోరిక తీర్చడం లేదనే కోపంతో ఆ వైద్యుడు తన సహచరులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె వద్దంటున్నా ఇబ్బంది పెట్టడం.. ఆమెను అసభ్యంగా తాకడంతో తట్టుకోలేక సర్జికల్ బ్లేడ్ తో అతడి మర్మాంగంపై దాడి చేసింది. దాడి చేసిన సమయంలో అతడికి తీవ్రంగానే గాయం అయింది. ఆ గాయం వల్ల అతడికి రక్తస్రావమైంది. ఆ సమయంలోనే అతడు దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి.. రహస్యంగా చికిత్స చేయించుకున్నట్టు పోలీసులు గుర్తించారు.. ఆస్పత్రిలో రక్తంతో తడిసిన బెడ్.. సర్జికల్ బ్లేడ్.. ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆ వైద్యుడు ఆ గాయం నుంచి ఉపశమనం కోసం మద్యం తాగినట్టు తెలుస్తోంది. ఆస్పత్రి బెడ్ పక్కన మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. “నర్స్ చెప్పిన సమాచారం ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసాం. కేసు దర్యాప్తు చేస్తున్నాం. అన్ని వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సిసి ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నామని” పోలీసులు చెబుతున్నారు.