Vidadala Rajani : రాజకీయ పార్టీల్లో ట్రబుల్ షూటర్లు ఉంటారు. పార్టీకి కష్టం వచ్చినా ఇట్టే వాలిపోతారు.దేశంలో జాతీయ పార్టీలకే ఈ ట్రబుల్ షూటర్లు ఉండేవారు.ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సైతం ముందు జాగ్రత్తగా ఈ ట్రబుల్ షూటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ముందు జాగ్రత్తలో ఉండేవారు. పార్టీకి ఇబ్బంది వచ్చినా ఒక బృందాన్ని ప్రయోగించేవారు. ఇప్పుడు వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంతో ట్రబుల్ షూటర్ అవసరం ఏర్పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి రూపంలో ఆ పార్టీకి ట్రబుల్ షూటర్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన మితిమీరిన జోక్యంతోనే పార్టీకి పరిస్థితి అని ఒక కామెంట్ ఉంది. అందుకే వైసిపికి అత్యవసరంగా ఒక ట్రబుల్ షూటర్ అవసరమయ్యారు. ఆ స్థానాన్ని మాజీమంత్రి విడదల రజనీకి కట్టబెట్టారు జగన్. ప్రస్తుతం ఆమె పార్టీ అసంతృప్త నేతలతో చర్చలు జరిపే పనిలో ఉన్నారు. ఇంట్లో కొంత సక్సెస్ అవుతుండడంతో ఇకనుంచి వైసీపీకి శాశ్వత ట్రబుల్ షూటర్ అవుతారని అంచనాలు ఉన్నాయి.
* 2019లో తొలిసారిగా
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు విడదల రజిని. అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న రజనీని వైసీపీలోకి రప్పించి టికెట్ ఇచ్చారు జగన్. అప్పట్లో మంత్రి పత్తిపాటి పుల్లారావుపై గెలిచి రికార్డు సృష్టించారు రజిని.అందరి దృష్టిని ఆకర్షించ గలిగారు. పార్టీలో కూడా ఆమెకు ప్రాధాన్యం పెరిగింది. విస్తరణలో జగన్ ఆమెకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. కీలక పోర్ట్ పోలియో కేటాయించారు.
* ఈ ఎన్నికల్లో ఓటమి
ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రజిని.చిలకలూరిపేటలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో జగన్ టికెట్ మార్చారు.అయినా ఫలితం లేకుండా పోయింది.ఓటమి తర్వాత ఆమె పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది.బిజెపిలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడిచింది.కానీ అటువంటిదేమీ జరగలేదు.ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నాయకులతో చర్చలు జరిపే బాధ్యతను అప్పగించారు జగన్.
* ఇప్పుడు కొత్త అవతారం
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని ప్రచారం సాగింది. స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. ఆయనతో చర్చలు జరిపారు. అయినా సరే బాలినేని వెనక్కి తగ్గలేదు. అనుచరులతో సమావేశమై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం ప్రారంభమైంది.ఈ క్రమంలో చర్చలు జరిపేందుకు విడదల రజినీని ప్రయోగించారు జగన్.హైదరాబాదులో బాలినేని ఇంటికి వెళ్లిన రజిని ఆయనతో చర్చలు జరిపారు.స్వయంగా పార్టీ అధినేత చెప్పినా బాలినేని వినలేదు. అటువంటిది రజిని మాట వింటారా? అన్నది చూడాలి.