NTR : లెజెండరీ నటుడు ఎన్టీఆర్ రెండో వివాహం ఒక సంచలనం. ఏడు పదుల వయసులో ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకంపనలు రేపింది. అసలు ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోవడాన్ని జనాలు ఎలా చూశారు? అంగీకరించారా? తిరస్కరించారా?. ఈ ఘటనతో అది తేలిపోయింది.
ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన చెరగని ముద్ర వేశారు. నిజంగా రాముడు, కృష్ణుడు ఇలానే ఉండేవారా? అని ప్రేక్షకులు ఆయన్ని పౌరాణిక పాత్రల్లో చూసి మైమరచిపోయేవారు. అందుకే ఎన్టీఆర్ ని అభిమానులు ప్రత్యేకంగా చూసేవారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక, ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఆయన తీసుకున్న వినూత్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు పేద ప్రజలకు దగ్గర చేశాయి. ఎన్టీఆర్ ఒక మహోన్నతమైన వ్యక్తి అనే భావన కొనసాగుతున్న తరుణంలో ఆయన రెండో వివాహం ప్రకటన చేశారు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!
లక్ష్మి పార్వతి అనే మహిళా అభిమాని, ఎన్టీఆర్ కి దగ్గరైంది. ఆయన జీవిత చరిత్ర రాయడం కోసం ఆమె పరిచయం అయ్యారు. ఈ క్రమంలో అనుక్షణం ఎన్టీఆర్ తో లక్ష్మి పార్వతి ఉండేవారు. ఆయన బాగోగులు చూసుకునేవారు. ఈ పరిణామాలు లక్ష్మి పార్వతి పట్ల ఎన్టీఆర్ ప్రేమ కలిగేలా చేశాయి. ఎన్టీఆర్-మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్. ఈ మూవీ శత దినోత్సవ వేడుకలో లక్ష్మి పార్వతిని పెళ్లాడబోతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రకటన టీడీపీ పార్టీ మనుగడను దెబ్బ తీస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలవడం అసంభవం అని రాజకీయ విశ్లేషకులు భావించారు.
అయితే అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 1994లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అంటే లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవడం వలన ఎలాంటి వ్యతిరేకత తలెత్తలేదు. ప్రజలు దాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయం లానే చూశారు. అందుకే ఎన్నికల్లో గెలిపించారు. కాగా ఎన్టీఆర్ కుటుంబంలో మాత్రం సంక్షోభం తలెత్తింది. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ భార్యగా వారు అంగీకరించలేదు. ఆ వ్యతిరేకతే ఎన్టీఆర్ కి సీఎం పదవిని దూరం చేసింది. క్యాంపు రాజకీయాలతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. పదవిని కోల్పోయిన ఎన్టీఆర్ 1996లో కన్నుమూశారు.
Also Read : ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్