Niharika: నటిగా కెరీర్ ఎంచుకున్న వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ నిహారిక కొణిదెల. నటుడు నాగబాబు ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. నచ్చిన రంగాల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని ఆయన భావించారు. ‘ఒక మనసు’ మూవీతో నిహారిక సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అయితే మెగా అభిమానుల్లో నిహారిక ఎంట్రీపై ఒకింత అసహనం వ్యక్తమైంది. నిహారిక నిరసనలకు ఎదురెళ్లి తన కల నెరవేర్చుకున్నారు. ఒక మనసు ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. నిహారిక నటనకు ప్రశంసలు దక్కాయి. నాగ శౌర్య హీరోగా నటించారు. ఒక మనసు ట్రాజిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేశారు. అయితే కమర్షియల్ సక్సెస్ అందలేదు. పెదనాన్న చిరంజీవి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి లో నిహారిక చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. యుద్ధంలో నరసింహారెడ్డికి సహాయపడే ట్రైబల్ లేడీ వారియర్ గా అలరించారు. నటిగా కొనసాగుతూనే నిహారిక నిర్మాత అవతారం ఎత్తారు. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్లు నిర్మించారు.
నిహారిక యంగ్ టాలెంట్ ని ఆ విధంగా ప్రోత్సహించారు. నటిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తున్న తరుణంలో నాగబాబు ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజుల పాటు నిహారిక వివాహం అట్టహాసంగా నిర్వహించారు. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే నిహారిక పెళ్లికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ హాజరైన నిహారిక వెడ్డింగ్ నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
కాగా పెళ్లి తర్వాత కూడా నిహారిక కెరీర్ కొనసాగించాలనుకున్నారు. నటిగా కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటించారు కూడా. అయితే ఒక్క ప్రాజెక్ట్ కూడా విడుదల కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… నిహారిక నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారట. భర్త వెంకట చైతన్యతో పాటు అత్తింటివారు సలహా మేరకు నిహారిక నటనకు దూరమయ్యారంటున్నారు. నిహారిక భర్త నిర్ణయం మేరకు సినిమాలు మానేశారంటున్నారు. అయితే ఆమె నిర్మాతగా కొనసాగనున్నారట. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు, సిరీస్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారట.