
Murder of YS Viveka: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగం పుంచుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది. దీంతో విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారణ చేసి వివరాలు సేకరించింది. కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివేకా కూతురు తాజాగా స్పందించారు. తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని చెప్పారు.
నేడు వివేకా వర్ధంతి..
2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగేళ్లయినా ఈ కేసు విచారణ కొలిక్కి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ కారణంగానే విచారణలో జాప్యం జరగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వారి హస్తం ఉన్నందునే విచారణకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా, బుధవారం వివేకానందరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద కుమార్తె సునీతారెడ్డి నివాళులర్పించారు.
దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారు…
ఈ సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించా. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు కూడా తెలుసు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నా. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా వదిలిపెట్టను’’ అని సునీత స్పష్టం చేశారు.
త్వరలోనే కేసు కొలిక్కి..
కేసు దర్యాప్తు ఏపీ దాటాక, విచారణ వేగవంతమైంది. సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. అనుమానితులందరినీ విచారణకు పిలుస్తోంది. కీలక సమాచారం సేకరిస్తోంది. దాదాపు కేసు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తోంది. మరోవైపు ఏ కొత్త విషయం వెలుగులోకి వచ్చినా అందులో సునీతారెడ్డి ఇంప్లీడ్ అవుతున్నారు. దీంతో అనుమానితుల గుండెళ్లో రైళ్తు పరిగెడుతున్నాయి. మొత్తంగా వివేకా హంతకులెవరో త్వరలోనే తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగతాయా.. లేక కేసు కొలిక్కి వస్తుందా అన్నది వేచిచూడాలి.