Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోస్ తో దూసుకుపోతున్నారు. ఇటీవల బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన “అఖండ” బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మొగిస్తుంది. కాగా బాలయ్య సినిమా కెరీర్ చూస్తే కేవలం కమర్షియల్ జోనర్ కి మాత్రమే పరిమితం కాకుండా… ప్రయోగాలు చేయడానికి కూడా ఎప్పుడూ ముందుంటారు. ‘అఖండ’ సినిమాలో అఘోరా గెటప్ లో తన నట విశ్వరూపం చూపించారు బాలయ్య. ఆ పాత్రలో దేవాలయాల గొప్పదనాన్ని, హైంధవ ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో వరుస సినిమాలను సైన్ చేస్తున్నారు బాలయ్య.
కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇటీవల ఆ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలానే అనిల్ రావిపూడి వంటి కుర్ర దర్శకులు కూడా బాలయ్యతో మూవీ చేయబోతున్నారు. చాలా కాలంగా బాలయ్య ‘శంకరాచార్య’ పాత్ర పోషించాలను కుంటున్నారు. హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించాలనేది బాలయ్య ప్రయత్నం. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా తయారవుతోందని తెలుస్తోంది.
బాలయ్యతో నిర్మాత సి.కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘జై సింహా’, ‘రూలర్’ వంటి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్యతో సినిమా తీయాలనుకుంటున్నారు సి.కళ్యాణ్. ఈ విషయాన్ని కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ శంకరాచార్యకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమవుతోందని… బాలయ్య పర్మిషన్ ఇస్తే ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయం అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.