Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో ఇప్పటికీ ఈ చిత్రం విజయవంతంగా ఆడుతోంది, 40 కోట్ల షేర్ వసూళ్ల వైపు దూసుకొని వెళ్తోంది. ఇకపోతే నిన్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి అక్కినేని నాగార్జున , అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథులుగా హాజరై , తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు , ఆయన మాటలు మేకర్స్ ని ఆలోచింపచేస్తున్నాయి.
ఆయన మాట్లాడుతూ ‘మా అన్నపూర్ణ స్టూడియోస్ టీం గురించి గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఈ సందర్భంగా వాళ్ళ గురించి ఒక్కటే చెప్తాను. సినీ ఇండస్ట్రీ లోనే నా అన్నపూర్ణ స్టూడియోస్ టీం ది బెస్ట్ అని నేడు గర్వంగా చెప్తున్నాను. అయితే వాళ్ళు కోరినవి నేను అందించలేకపోయాను. ఈ సినిమాని మాకు విడుదలకు రెండు , మూడు వారాలకు ముందే ఇవ్వమని టీం నన్ను రిక్వెస్ట్ చేసింది. కచ్చితంగా వాళ్లకు రెండు వారాల ముందే ఇస్తానని మాట ఇచ్చాను. కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను , కేవలం రెండు మూడు రోజుల ముందే ఈ సినిమాని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అయినప్పటికీ ది బెస్ట్ క్వాలిటీ ని అందించారు. అదే రెండు వారాల ముందు ఈ చిత్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి ఉండుంటే లెనిన్ క్వాలిటీ ఎక్కడో ఉండేది’ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా దయచేసి సినిమాకు పనిచేసే వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను , సినిమాని విడుదలకు రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ కి ఇచ్చేయండి. లెనిన్ ని మేము అలా అందించలేకపోయాము, అందులో నా తప్పు కూడా ఉంది. చివరి నిమిషం లో అనేక కరెక్షన్స్ చెప్పాను. రీసెంట్ విడుదలైన ‘ఒడిస్సీ’ చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమా విడుదల తేదీని వాళ్ళు ఏడాది క్రితమే ప్రకటించారు. ఎలాంటి వాయిదాలు లేకుండా చెప్పిన తేదికి సినిమాని విడుదల చేశారు. అలా మన తెలుగు సినిమాలు ఎందుకు నిర్దిష్ట సమయం లో నిర్మాణం అవ్వడం లేదు?, ఇది ప్రతీ ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే. ఆరోజుల్లో మేము ‘మాస్’ సినిమాని విడుదలకు నెలరోజుల ముందే ఫైనల్ కాపీ ని చూశాము , నా సినిమాలు దాదాపుగా అన్నీ అలాగే జరిగాయి. కానీ ఇప్పుడు ఎందుకు అలా అవ్వడం లేదు’ అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.



