యువ హీరో నాగశౌర్య రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ దక్కి చాలా కాలమే అయింది. ప్రస్తుతం రీతూ వర్మ జంటగా, లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న సినిమా ‘వరుడు కావలెను’. పక్కా యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్‌లలో విడుదల కాబోతుంది.

కాగా తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన వీడియోలు, ఫొటోస్ ప్రేక్షకులను బాగా అలరించాయి. కానీ ఈ సినిమా అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదు అని, అందుకే కొన్ని సీన్స్ రీషూట్ చేశారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకముందే డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య చెప్పిన స్క్రిప్ట్ బాగుందట.
అయితే, తీరా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చూశాక, అవుట్ ఫుట్ పట్ల నిర్మాత సంతృప్తి చెందక మరో ఇద్దరు రచయితలను కూర్చోపెట్టి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయించి మరీ మళ్ళీ రీషూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మార్పులు సినిమాకు చాలా ప్లస్ అవుతాయని అందుకే యూనిట్ ధైర్యంగా రిలీజ్ కి ముందడుగు వేస్తున్నారు.
ఇక నాగశౌర్య-రీతూవర్మ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. టైటిల్ కూడా సాఫ్ట్ గా బాగుండటంతో సినిమా పై అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకు ఎంతవరకు ఓపెనింగ్స్ వస్తాయి అన్నది చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.