సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్. అందులోనూ హీరోయిన్ల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఏ మాత్రం తేడాగా కనిపించినా.. ఫేడ్ ఔట్ అయిపోనట్టుందేంటీ? అంటూ ముడతలు వెతికేస్తుంటారు. వంకలు పెట్టేస్తుంటారు. అందుకే.. హీరోయిన్లు అందం కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడుతుంటారు.
కానీ.. వయసు ఆగదు కదా..? దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అయితే.. దాదాపుగా అందరూ ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేరు. కానీ.. ఈ నిజాన్ని అంగీకరించేవారు అతికొద్ది మంది ఉంటారు. వారిలో తానూ ఉన్నానంటోంది బాలీవుడ్ అండ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
ఒకప్పటి మాదిరిగా అందంగా కనిపించడానికి తానేం ఆరాటపడట్లేదని చెబుతోంది ప్రియాంక. తన వయసు పెరుగుతోందని, ఆ విషయం తనకు స్పష్టంగా అర్థం అవుతోందని చెప్పడం విశేషం. వయసు రిత్యా శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నానని, వాటిని అంగీకరిస్తున్నానని కూడా చెప్పారు.
‘‘అందం విషయంలో అబద్ధం చెప్పను. అలా అబద్ధం చెప్పి, ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నిజమే నాకు వయసు అయిపోతోంది. నా బాడీ షేప్ మారిపోతోంది. నేను మరింతగా పెద్దదాన్ని అవుతున్నాను. శారీరకంగా, మానసికంగా ఈ విషయాన్ని స్వీకరిస్తున్నాను. నా వయసులో ఎలా కనిపించాలో అదేవిధంగా కనిపిస్తున్నాను’’ అని చెప్పారు ప్రియాంక.
యంగ్ ఏజ్ లో ఉన్నట్టు ఇప్పుడు కనిపించాలంటే కుదరదు అని చెబుతోందీ బ్యూటీ. అంతేకాదు.. అలా కనిపించాలనే ఆశ కూడా తనకు లేదని చెబుతోంది. అందంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేసి, శరీరాన్ని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేస్తోంది ప్రియాంక. వయసు పెరుగుతున్నప్పుడు అందంగా కనిపించడం అనేది మన ఆత్మవిశ్వాసం మీదనే అధారపడి ఉంటుందని చెబుతోంది. ప్రియాంక చోప్రా వయసు 38 సంవత్సరాలు.
ఈ వయసులో ఎంతో మంది హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మేకప్ నుంచి కాస్మోటిక్ సర్జరీల దాక ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఇవేవీ చేయకుండా ప్రియాంక వాస్తవాన్ని గుర్తించడం గొప్ప విషయమే కదా?