షాది ముబారక్ కి మీడియా రేటింగ్స్ అన్యాయం చేశాయా?

షాది ముబారక్ మార్చి మొదటివారంలో విడుదలయ్యింది. అన్ని మీడియా సంస్థలు రివ్యూ 2.5/5 ఇచ్చాయి. వాస్తవానికి ఇది ఆ సినిమాకి అన్యాయం చేసినట్లే. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఇది ఆన్ లైన్ లో చూసిన తర్వాత ఈ సినిమా కి మీడియా సంస్థలు అన్యాయం చేసిందనిపిస్తుంది. అదేంటో చూద్దాం. ముందుగా ఇది చాలా క్లీన్ సినిమా. సకుటుంబ సపరివారంగా అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఇందులో ఎటువంటి హింసాత్మక […]

Written By: Ram, Updated On : April 19, 2021 8:56 am
Follow us on


షాది ముబారక్ మార్చి మొదటివారంలో విడుదలయ్యింది. అన్ని మీడియా సంస్థలు రివ్యూ 2.5/5 ఇచ్చాయి. వాస్తవానికి ఇది ఆ సినిమాకి అన్యాయం చేసినట్లే. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఇది ఆన్ లైన్ లో చూసిన తర్వాత ఈ సినిమా కి మీడియా సంస్థలు అన్యాయం చేసిందనిపిస్తుంది. అదేంటో చూద్దాం.

ముందుగా ఇది చాలా క్లీన్ సినిమా. సకుటుంబ సపరివారంగా అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఇందులో ఎటువంటి హింసాత్మక సన్నివేశాలు, శృంగారం పేరుతో వెకిలి చేష్టలు చూపించే సన్నివేశాలు అసలు లేవు. అలా అని సీరియస్ మూవీ కానే కాదు. ఒక చిన్న సంఘటనని ఆధారం చేసుకొని ప్రజల్ని ఎలా అలరించవచ్చో ఈ సినిమా చూసి అందరూ నేర్చుకోవాలి. ముందుగా కధా గమనం చాలా నీట్ గా జరిగింది. మొదటి హాఫ్ అంతా మూడు పెళ్లి చూపులతో హ్యాపీగా గడిచిపోతుంది. హీరో సున్నిపెంట మాధవ్ ( మొగలిరేకులు ఫేం సాగర్ ఆర్ కే నాయుడు ) ఆస్ట్రేలియా నుంచి పెళ్ళిచూపుల కోసం ఇండియా వస్తాడు. మ్యారేజ్ బ్యూరో నడిపే హీరోయిన్ సత్యభామ (దృశ్య రంగనాథ్ ) తల్లి కాలు బెనికి నడవలేని పరిస్థితుల్లో తనే హీరో కి మూడు పెళ్లి చూపులు చూపించటానికి తనతో కారులో వెళ్తుంది. కారు డ్రైవర్ గా రమేష్ ( రాహుల్ రామకృష్ణ) తనదైన శైలిలో రక్తి కట్టించాడు. మూడో పెళ్లి చూపులు అయ్యే లోపల హీరో , హీరోయిన్ లు ప్రేమలో పడతారు. కాని హీరో అనుకోకుండా మూడో పెళ్లి కూతురుకి ఓకే చెప్పటంతో కధ మలుపుతిరుగుతుంది. రెండో హాఫ్ లో ఆ మలుపుల్ని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ చివరకు సుఖాంతమవుతుంది.

ఇంత చిన్న కధని ఎక్కడా బోరు కొట్టకుండా చిత్రించిన తీరు అభినందించదగ్గది. సినిమాలో సందర్భంతో సంబంధం లేకుండా పెట్టే హీరో హీరొయిన్ పాటలు లేవు. కేవలం సందర్భానికి అనువుగానే పాటలు వున్నాయి. అయినా పాటలు ఆకొట్టుకునే విధంగా లేవనే చెప్పాలి. కాకపోతే అది ఈ సినిమాలో పెద్ద ఇష్యూ కాదు. ఆ పెట్టిన మూడు పాటలు అలరించి వుంటే తెలుగు ప్రేక్షకులకి కిక్కు వచ్చేదేమో. మొత్తం మీద చూస్తే ఆ అంశం అంత ప్రాధాన్యత కలిగిందిగా లేదు. గీత గోవిందం సినిమా థీం కి దగ్గరగా ఈ సినిమా వుంది.

ఇక పాత్రధారుల విషయానికి వస్తే హీరొయిన్ దృశ్య రంగనాథ్ కొత్త సినిమా అయినా అన్ని హావభావాలు ఎంతో అనుభవం వున్న నటి లాగా వండి వార్చింది. ఈ సినిమాకి తన క్యారెక్టర్ హైలైట్. ఇక హీరో గా సాగర్ నీట్ గా, హ్యాండ్ సమ్ గా వున్నాడు. ఈ సినిమా తో తను నిలదోక్కుకున్నట్లే అనిపించింది. రాహుల్ రామకృష్ణ, భద్రం, హేమంత్ కామెడీ బాగానే రక్తి కట్టించారు. చిన్న పాత్రలో నైనా ప్రియదర్శి రాం ( సాక్షి దినపత్రిక ఫ్యామిలీ ఎడిటర్ ఫేం ) ఇంప్రెస్ చేసాడు. పద్మశ్రీ కధ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం బాగుంది. దిల్ రాజు సినిమా నిర్మాత . హైదరాబాద్ సిటీ లోనే  ఎక్కువ లొకేషన్స్, మొదటి హాఫ్ కార్ లోనే ఎక్కువ సీన్స్ మొత్తం మీద అతి తక్కువ ఖర్చుతో ప్రేక్షకుల్ని అలరించిందనే చెప్పొచ్చు. నిజానికి గీత గోవిందం కి వేసిన మార్కుల్లో మూడొంతులు ఈ సినిమాకి కూడా వేయొచ్చు. కాని అది జరగలేదు. కనీసం 3/5 అయినా రేటింగ్ ఇవ్వదగ్గ సినిమా షాది ముబారక్. ఇప్పటివరకు చూడనివాళ్ళు తప్పకుండా అమెజాన్ ప్రైమ్ లో చూడమని నా గట్టి రికమండేషన్.

-మీ రామ్