Black Panther Wakanda Forever Review: హాలీవుడ్లో మార్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం కథ, దాని ద్వారా పుట్టుకొచ్చే పాత్రల ఆధారంగా మార్వెల్ సినిమాలు రూపొందుతూ ఉంటాయి. ఇప్పటిదాకా వచ్చిన సిరీస్ లు మొత్తం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ముఖ్యంగా హాలీవుడ్లో అవతార్ తర్వాత ఈ మార్వెల్ సినిమాలే అత్యధికంగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఇక మార్వెల్ సిరీస్ లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక స్థాయిలో ఉంటాయి. ఇక ఈ సిరీస్ లో గతంలో వచ్చిన బ్లాక్ ఫాంథర్ ఎంత బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని సీక్వెల్ వకండా ఫరెవర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

యూత్ పోటెత్తారు
నిన్న మూడు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ యువత మాత్రం ఈ సినిమాకే పోటెత్తింది. ఉదయం 9 గంటల నుంచి ఐమ్యాక్స్ లాంటి మల్టీప్లెక్స్ల్లో పడిన షోలకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మొదటి భాగం హీరో చాడ్విక్ బ్రోస్మన్ ఇటీవల కన్ను మూయడంతో ప్రేక్షకుల్లో ఒక రకమైన ఎమోషన్ ఏర్పడింది. దీంతో వారు ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురుచూశారు. ప్రేక్షకులను అంతగా కట్టిపడేసిన ఈ నల్ల వజ్రం కథ ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
ఇదీ కథ
తెలుగులో వచ్చిన బాహుబలి, కన్నడలో వచ్చిన కే జి ఎఫ్, తమిళంలో వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలాగే ఈ సినిమాకి కూడా ఖచ్చితమైన కొనసాగింపు ఉంది. రాజు(చాడ్విక్ బ్రోస్మన్) చనిపోయాక వకాండ రాజ్యం అనాథగా మారుతుంది. ఈ ప్రాంతంలో లభించే అరుదైన వైబ్రేనియం అనేక ఖనిజం మీద శత్రు దేశాలు కన్నేస్తాయి. దీనికోసం దాడులకు కూడా తెగపడతాయి. అయితే వాటిని వకాండ సైనికులు తిప్పికొడతారు. ఇతర ప్రాంతాల్లో దొరికే అవకాశం ఉన్నప్పటికీ ఇతర దేశాలకు సాగించే దాడులకు నమోర్( టేనాక్ హుయార్టా) అడ్డు తగుల్తూ ఉంటాడు. ఈలోగా వైబ్రేనియం కోసం ఒక శాస్త్రవేత్తతో వకాండ రాణి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇక్కడే సినిమా అసలు మలుపు తిరుగుతుంది. అనంతరం షూరి ( లేటిటియా రైట్) రంగ ప్రవేశం చేస్తాడు. అసలు వారి లక్ష్యం ఏమిటి ? అది ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీసింది? వకాండ రక్షణ కోసం చివరికి ఎవరు బ్లాక్ ఫాంథర్ అయ్యారు అనేది తెర మీద చూడాల్సిందే.

విజువల్ ట్రీట్
2.44 గంటల పాటు సాగే విజువల్ డ్రామా ఇది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీత లాగా ఉన్నప్పటికీ బ్లాక్ పాంథర్ ప్యాన్స్ సంతృప్తి చెందుతారు. అయితే చార్విక్ కు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఇరికించిన సీన్స్ చాలావరకు బోర్ కొట్టిస్తాయి. కొన్ని సీన్స్ థోర్ తరహా మాదిరి అనిపిస్తాయి. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంటాయి. మామూలుగా చూసినా ప్రేక్షకులు థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మరీ ఎక్స్ ట్రాడినారీ అనిపించేలా కాకున్నా పాంథర్ అభిమానులకు మాత్రం కన్నుల పండువ.