Mohan Babu: కొన్నాళ్లుగా నటుడు మోహన్ బాబుకు మనశ్శాంతి కరువైంది. ఆయన కుటుంబంలో కలహాలు చెలరేగాయి. చిన్న కొడుకు మనోజ్ తో గొడవలు రచ్చకెక్కాయి. మంచి చెడు వదిలేసి రోడ్డున పడ్డారు. తండ్రి తనపై దాడి చేశాడని మనోజ్ మీడియా ఎదుట ఆరోపణలు చేశాడు. మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక నుండి తనకు ప్రాణ హాని ఉందని రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద పెద్ద హైడ్రామా నడిచింది.
మోహన్ బాబు వద్ద ఉన్న రెండు గన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జుల్పల్లి ఫార్మ్ హౌస్లో మోహన్ బాబు ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. రిపోర్టర్ చేతిలోని మైక్ లాక్కుని తలపై బలంగా కొట్టాడు. పై దవడ పై ఉండే ఒక ఎముక డ్యామేజ్ అయ్యింది. దాడిలో గాయపడిన రిపోర్టర్ ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది. కావాలని చేసిన దాడి కాదు. ఆ చీకట్లో మీడియా వాళ్ళు ఎవరో, ప్రత్యర్ధులు ఎవరో అర్ధం కానీ పరిస్థితి ఉందని, మోహన్ బాబు వివరణ ఇచ్చారు.
స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రిపోర్టర్ ని పరామర్శించాడు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు బుక్ చేశారు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు చుక్కెదురైంది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆపాలంటూ మోహన్ బాబు లాయర్లు వేసిన పిటిషన్ ని న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్ట్ ని ఆపలేమని కోర్టు తెలియజేసింది.
ఈ క్రమంలో మోహన్ బాబు అరెస్ట్ ఖాయం అంటూ కథనాలు వెలువడుతున్నాయి. రాచకొండ పోలీసులు ఇప్పటికే మోహన్ బాబు అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయితే… మోహన్ బాబు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. సుదీర్ఘ సినిమా ప్రస్థానం కలిగిన మోహన్ బాబుకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు..