MegaStar Wishes Pawan Kalyan: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా తన తమ్ముడికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చిరు ట్వీట్ చేస్తూ.. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ‘శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. సౌందర్‌రాజన్ ప్రతి సంవత్సరం పవన్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.
ఇక పవన్ లోని సుగుణాలను అభిమానించి, ఆరాధించే లక్షలాదిమంది నేడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవర్చుకున్న నిజమైన పోరాట వీరుడు. పవన్ లో ఉన్న మరో అద్భుత లక్షణం.. చేసిన మేలు గురించి ఎన్నడూ పబ్లిసిటీ చేసుకోకపోవడం.
తెలుగు సినీ లోకంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. ఈ సేవా మూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో పవన్ భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి అభిమానులు ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నారు.