
Power Star Pawan Kalyan: పవన్ కల్యాణ్ అనే పేరు ఎంత పాపులరో.. ‘పవర్ స్టార్’ అన్న ట్యాగ్ లైన్ అంతకు మించి పాపులర్. మిగిలిన హీరోల బిరుదుల మీద కంప్లైంట్లు ఉండొచ్చుగానీ.. పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ మీద మాత్రం ఎవరికీ సెకండ్ ఒపీనియన్ లేదు. ఆడియన్స్ తోపాటు ఇండస్ట్రీ కూడా ఆమోదించింది. అయితే.. పవర్ స్టార్ అనే బిరుదును పవన్ కు ఎవరిచ్చారు? మొదటి సారిగా పవన్ ను ఎవరు ఇలా పిలిచారు? అనే విషయం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అదేంటో చూద్దాం.
సినిమాల్లోకి రాక ముందు పవన్ కల్యాణ్ అసలు పేరు కల్యాణ్ కుమార్. మెగా హోం బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ లో నిర్మాణ బాధ్యతలు చూసుకునేవాడు. కల్యాణ్ టాలెంట్ చూసిన మెగాస్టార్.. దర్శకత్వం వైపు వెళ్లమని సలహా ఇచ్చాడు. కానీ.. నటనపై ఆసక్తితో తాను తెరపైకి వస్తానని చెప్పాడు కల్యాణ్. ఆ విధంగా.. కల్యాణ్ నటించిన మొదటి మూవీ ‘అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి’ రిలీజైంది.
తొలి సినిమాతో పవర్ స్టార్ అనే బిరుదు రాలేదుకానీ.. దానికి బీజం మొదటి సినిమాలోనే పడిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో పవన్ ఒరిజినల్ గా సాహసాలు చేసిన సంగతి తెలిసిందే. చేతుల మీదుగా పాతిక కార్లు పోనిచ్చుకుంటాడు. గుండెలపై పెద్ద పెద్ద బండలు పెట్టుకొని, సుత్తెతో పగలగొట్టిస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకూ ఏ హీరో కూడా ఇలాంటి సాహసాలు చేయలేదు. ఇది ఆడియన్స్ తో సహా అందరినీ ఆకర్షించింది.
దీని తర్వాత ‘గోకులంలో సీత’ సినిమా చేశాడు పవన్. ఈ సినిమాలోనే కల్యాణ్ పేరు ముందు పవన్ వచ్చి చేరింది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ను ‘పవర్ స్టార్’ అని అన్నారు పోసాని. ఇదే విషయాన్ని మీడియా కూడా రాసింది.
ఆ తర్వాత వచ్చిన ‘సుస్వాగతం’ చిత్రంలో.. పవన్ కల్యాణ్ పేరు ముందు ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ తొలిసారిగా టైటిల్ కార్డులో వేశారు. ఆ విధంగా.. పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ ను చేశారు పోసాని కృష్ణ మురళి. ఈ విషయాన్ని పోసానితోపాటు పవన్ కూడా గతంలో చెప్పారు. మొత్తానికి పవన్ ను సార్థక నామధేయుడిని చేశారు పోసాని.