కన్నడనాట ‘కంఠీరవ రాజ్ కుమార్’ అంటే.. కర్ణాటక ప్రముఖుల చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన ఒక ప్రభంజనం. ఇక్కడ ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ ఎలాగో, కన్నడ చిత్ర సీమలో రాజ్ కుమార్ అలా. మొత్తమ్మీద కన్నడ సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు రాజ్ కుమార్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి.
రాజ్ కుమార్ తో దిగిన అలనాటి ఆరూపమైన ఫోటోను ప్రేక్షక లోకానికి పరిచయం చేస్తూ.. ఆ మహనీయుణ్ణి గురించి అద్భుతమైన మెసేజ్ ను కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ ఏమిటి ఆ మెసేజ్ అంటే.. ‘గొప్పతనం ఆయన సింప్లిసిటీలో ఉంటుంది. అన్నావరు మాటలు, అలాగే ఆయన పనులు చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నా జీవితం పై ‘కంఠీరవ రాజ్ కుమార్’ ప్రభావం ఎంతో ఉంది. డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా నిజమైన బంగారద మనుష్య (బంగారు మనిషి)ను గుర్తు చేసుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో మెసేజ్ పెడుతూ రాజ్ కుమార్ తో దిగిన రేర్ ఫొటోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చిరును ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంటున్న రాజ్ కుమార్ టచింగ్ తో చిరు చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలో కనిపించారు. ఇక రాజ్ కుమార్ మహా నటుడిగానే కాకుండా ఆయన సింగర్ గానూ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించారు. రాజ్ కుమార్ సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా.. అదేవిధంగా ఆయనకు పద్మ భూషణ్, కర్ణాటక రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, కెంటకీ కల్నేల్ ఇలా ఎన్నో గొప్ప బిరుదులూ వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.
తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఆయన ఎప్పుడూ అంటుంటారు. ఇక 2006, ఏప్రిల్ 12న రాజ్ కుమార్ అందరిని విడిచి అనంతలోకాలకేగారు. ఆయన ఈ లోకాన్ని విడిచి పదిహేను సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆయనను కన్నడ ప్రజలు తమ హృదయాల్లో ఇప్పటికీ శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. కాగా నేడు ఆయన 91వ జయంతి కావడంతో యావత్తు అభిమాన లోకంతో పాటు సినీ లోకం కూడా ఆయనను
స్మరించుకుంటున్నారు.