కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ మధ్య దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. కరోనా టీకా ధరల విషయంలో మోడీసర్కార్ అభాసుపాలైంది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పుకొస్తోంది.
ఇటీవల మోడీ సర్కార్ కరోనా టీకాలను 50శాతం తాము టీకా కంపెనీలనుంచి తీసుకుంటామని.. మిగిలిన 50శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయాలని సూచించాయి. కేంద్రానికి రూ.150కు సీరం సంస్థ టీకా అమ్ముతుండగా.. రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600గా ధర నిర్ణయించింది.
దీనిపై దేశవ్యాప్తంగా జనాలు భగ్గుమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను అన్న మోడీ.. ఒకే టీకా మూడు ధరలేంటి? ఇలా వేర్వేరుగా అమ్మడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సైతం దీనిపై ట్విట్టర్ లో కేంద్రాన్ని నిలదీశారు.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ లు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. వెంటనే 25ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో దెబ్బకు కేంద్రంలోని మోడీ సర్కార్ దిగి వచ్చింది. తాము సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇకపై కూడా రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని తెలిపింది. రెండు టీకాలను రూ.150చొప్పు కొని రాష్ట్రాలకు పంచుతామని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్ చేసింది.