
Sai Dharam Tej Accident : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ నడుపుతూ మాదాపూర్ తీగల వంతెనపై నుంచి వెళుతుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. కుడికంటి పైభాగంలో దెబ్బ తగలడంతోపాటు కాలర్ ఎముక కూడా విరిగినట్టు సమాచారం.
అయితే.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముందుగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు చెప్పారు.
ఇదిలాఉంటే.. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే కోణంలో తీవ్ర చర్చ సాగుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటకు 50 కిలోమీటర్లకు మించి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా లేకపోతే.. 60 కి.మీ. వేగంతో వెళుతుంటారు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ 70 నుంచి 80 కి.మీ. మధ్య వేగంతో ప్రయాణించి ఉంటారనే అంచనా వినిపిస్తోంది.
సీసీటీలో ఈ దుర్ఘటనకు సంబంధించిన విజువల్స్ రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీని పరిశీలించినప్పుడు.. ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో.. బండిని వంచినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వేగంగా ఉన్న బైక్ బ్యాలెన్స్ ఔట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఫలితంగా.. లిప్తపాటులో బండి స్కిడ్ అయిపోవడం.. సాయి కిందపడిపోవడం.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం జరిగిపోయాయి.
కేవలం తలకు హెల్మెట్ ఉన్న కారణంగానే.. సాయిధరమ్ ప్రాణాలతో బయటపడ్డాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెల్మెట్ గనక లేకపోతే.. తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఉండేదని అంటున్నారు. అయితే.. నిజానికి కింద పడినా హెల్మెట్ ఊడిపోదు. కానీ.. సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ఊడి పడిపోయింది. దీనికి కారణం ఏంటన్నప్పుడు.. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారుగానీ.. మెడ దగ్గర ఉన్న స్ట్రిప్ ను తగిలించరు. ఈ కారణంగానే హెల్మెంట్ తల నుంచి ఊడిపోయే అవకాశం ఉంటుంది. సాయి విషయంలోనూ ఇదే జరిగి ఉండొచ్చని కూడా అంటున్నారు. కాబట్టి.. తప్పకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతోపాటు స్ట్రిప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.