కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడంతో టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. సురేశ్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ, ఇవన్నీ చిన్న సినిమాలే. పెద్ద హీరోలు నటించిన, ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల విషయంలో నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దాంతో ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుపుకున్న సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నప్పటికీ ముందడుగు వేయలేకపోతున్నారు. స్టార్ హీరోల మార్కెట్, ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అవడం కష్టమే. ఒకవేళ ఓపెన్ అయినా మునుపటిలా ప్రేక్షకులు వస్తారని చెప్పలేం. దాంతో, పెద్ద సినిమాల నిర్మాతలు, హీరోలు కూడా పునరాలోచనలో పడ్డారు.
జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం
ఈ క్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’ ఓటీటీలో రిలీజయ్యే తొలి పెద్ద సినిమాలా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఈ మూవీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఓ సంస్థ నుంచి 25 కోట్ల ఆఫర్ రాగా, ఇప్పుడు మరో ఫ్లాట్‌ఫామ్ ఏకంగా 30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో, ఆలస్యమైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్న నిర్మాతలు ఆలోచనలో పడ్డారని వినికిడి. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ నటించిన చిత్రం కావడంతో ‘రెడ్’పై అంచనాలు భారీగా పెరిగాయి. తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.