Manchu Manoj: టాలీవుడ్ లో కొన్ని పెద్ద కుటుంబాలు ఉన్నాయి. వాటి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన చిరంజీవి-మోహన్ బాబు మధ్య పలు సందర్భాల్లో విబేధాలు తలెత్తాయి. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇవ్వడాన్ని మోహన్ బాబు తప్పుబట్టారు. చిరంజీవికి ఇవ్వగాలేనిది నాకెందుకు ఇవ్వలేదని వేదిక మీద ఓపెన్ అయ్యాడు. అప్పడు మొదలైంది మంచు-మెగా ఫ్యామిలీ మధ్య లొల్లి. అలాగే 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసిషన్ ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలు చెరో పక్షం వహించాయి.
మంచు విష్ణు ప్రత్యర్థిగా నిలుచున్న ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకటించింది. అయితే మంచు విష్ణు గెలిచాడు. ఫలితాల అనంతరం మంచు విష్ణు మీడియా ముందు చిరంజీవి అంకుల్ నన్ను ఎన్నికల నుండి తప్పుకోమన్నారని ఆరోపణలు చేశాడు. కాగా మోహన్ బాబు కూతురు లక్ష్మి, మనోజ్ మాత్రం మెగా ఫ్యామిలీకి ఫ్రెండ్స్. వాళ్ళు రామ్ చరణ్ తో సన్నిహితంగా ఉంటారు.
మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కాగా… పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మంచు మనోజ్ సైతం హాజరయ్యాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చెన్నైలో ఉన్నప్పుడు రామ్ చరణ్, నేను కలిసి ఆడుకునేవాళ్ళం. అప్పటి నుండి మా మధ్య స్నేహం ఉంది. రామ్ చరణ్ మంచి మనిషి. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. కొందరు కొత్త పరిచయాలు అయ్యాక పాతవాళ్లను మర్చిపోతారు. కానీ రామ్ చరణ్ అలాంటి వాడు కాదు.
2018లో నేను అమెరికాలో ఉన్నాను. ఒక తెలుగు ఫ్యామిలీ దుబాయ్ లో చిక్కుకుపోయింది. ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పాస్ పోర్ట్ లాగేసుకున్నారు. ఆ ఫ్యామిలీకి డబ్బులు కావాలి. నేను కొంత సహాయం చేశాను. ఇంకా రూ. 5 లక్షలు కావాలి. నాకే టైట్ గా ఉంది. ఎవరిని అడగాలో తెలియలేదు. అప్పుడు రామ్ చరణ్ కి అర్ధరాత్రి ఫోన్ చేశాను. ఇలా రూ. 5 లక్షలు కావాలి. ఓ కుటుంబానికి సహాయం చేయాలి అన్నాను. అకౌంట్ డీటెయిల్స్ పంపమని నిమిషాల్లో డబ్బులు అరేంజ్ చేశాడు. రామ్ చరణ్ కి ఆ కుటుంబం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా పెద్ద స్టార్ అవుతాడు… అని మనోజ్ చెప్పుకొచ్చాడు.